
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాపై ఉన్నవారు గ్రీన్ కార్డ్ పొందడానికి అత్యంత కీలకమైన పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) కార్యక్రమం నుంచి భారతీయ ఐటీ దిగ్గజాలైన TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCLలతో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి 8 పెద్ద కంపెనీలను అమెరికా కార్మిక శాఖ సస్పెండ్ చేసింది.
ఉద్యోగం ద్వారా గ్రీన్ కార్డ్ సంపాదించడానికి మొదటి మెట్టు ఈ పర్మ్ ప్రాసెస్. ఒక కంపెనీ తన దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాలంటే.. మొదట ఈ ఉద్యోగానికి సరిపోయే అమెరికన్ ఉద్యోగులు ఎవరూ దొరకలేదని ముందుగా కార్మిక శాఖకు ఆధారాలతో ఇవ్వాలి. అలాగే విదేశీయులను తీసుకోవడం వల్ల అమెరిక్లనకు ఎలాంటి ప్రభావం లేదని ముందుగా భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఈ 8 కంపెనీలను సస్పెండ్ చేయడంతో వీటి నుంచి కొత్తగా పర్మ్ అప్లికేషన్లను అమెరికా ప్రభుత్వం తీసుకోదు.
పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా ప్రాసెస్ చేయదు. అంటే ఈ కంపెనీల్లో ఉన్న ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ప్రస్తుతానికి పూర్తిగా ఆగిపోయినట్లే. అయితే ఇప్పటికే మీ దగ్గర ఉన్న హెచ్-1బీ వీసాపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ లేదా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు వెంటనే ఉద్యోగం కోల్పోవడం కానీ, అమెరికా వదిలి వచ్చేయడం కానీ జరగదు. హెచ్-1బీ అనేది సాధారణంగా 6 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఒక తాత్కాలిక పని వీసా మాత్రమే.
Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. చర్చలు కాదని దాడులకు దిగితే ఇక యుద్ధమే!
ఎవరు ఎక్కువగా నష్టపోతారు?
ఈ సస్పెన్షన్ వల్ల ప్రధానంగా ఇద్దరికి సమస్యలు ఎదురవుతాయి. అమెరికా రూల్స్ ప్రకారం హెచ్-1బీపై గరిష్టంగా 6 ఏళ్లు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత అమెరికాలోనే ఉండాలంటే పర్మ్ పూర్తి అయి గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లోని ‘I-140’ ఆమోదం పొంది ఉండాలి. ఇప్పుడు పర్మ్ నిలిచిపోవడంతో 6 ఏళ్ల పరిమితికి దగ్గరగా ఉన్న టెకీలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. వీరు వేరే వీసాలైనా వెతుక్కోవాలి లేదా ఇండియాకు తిరిగి రాక తప్పదు. కంపెనీలు పర్మ్ అప్లై చేసే అవకాశం ఇప్పుడు లేదు. దీంతో కొత్తగా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకునే వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
అమెరికాలో వీసా నిబంధనలు కఠినంగా మారడంతో భారతీయ ఐటీ కంపెనీలు తమ రూల్స్ కొన్నింటిని మార్చుకోక తప్పడం లేదు. అమెరికాలోనే ఉన్న స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకుంటాయి. మేనేజర్లు, కీలక అధికారులకు ఎల్-1ఎ వీసాలను వాడుతాయి. ఈ వీసా ఉంటే పర్మ్ ప్రాసెస్ అవసరం లేకుండానే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్తే ఎలాగోలా గ్రీన్ కార్డ్ వచ్చి అక్కడే స్థిరపడిపోవచ్చు అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గ్రీన్ కార్డ్ రాకముందే వెయిటింగ్.. దీనికి తోడు ఇలాంటి సస్పెన్షన్లు రావడం వల్ల అమెరికాలో ఇన్నేళ్లు వెయిట్ చేసి ఉండాలా? అని టెకీలు ఆలోచిస్తు్న్నారు.
Also Read : టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు అమెరికా బిగ్ షాక్









