అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు ఎవరైనాసరే రష్యా నుంచి ఆయిల్ కొన్నా ఊరుకోమని, భారీగా పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ మిగతా దేశాలను బెదిరించారు. కానీ ఇప్పుడు తన సొంత మాటలను పూర్తిగా వెనక్కి తీసుకుని పెద్ద డ్రామాకే తెరతీశారు. ఏకంగా తన పాత శత్రువు, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కే స్వయంగా ఫోన్ చేసి.. మా దేశానికి డీజిల్ కావాలి, సరఫరా చేయండి అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని తెలుస్తోంది. అమెరికాలో నవంబర్ నెలలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ట్రంప్‌కు, ఆయన పాలక వర్గానికి అత్యంత కీలకంగా మారింది. అయితే సరిగ్గా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అమెరికా అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని తాకాయి.

Also Read : ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా నో ప్రాబ్లమ్.. మస్క్ స్టార్‌లింక్‌తో నెట్‌వర్క్.. ఎలాగంటే?

నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో అక్కడి సామాన్య ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో ఉన్న ఈ నెగిటివిటీ కొనసాగితే వచ్చే మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీకి ఓటమి తప్పదని ట్రంప్‌కు క్లారిటీ వచ్చింది. దీంతో దేశంలో ఇంధన ధరలను తగ్గించి తీరాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇంధనం చౌకగా దొరకాలంటే ప్రపంచంలో రష్యా కంటే పెద్ద దిక్కు మరొకటి లేదని గ్రహించిన ట్రంప్ తన ఈగోను పక్కనపెట్టి నేరుగా రష్యాతో రాజీకి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన ఈ కీలక చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. దీనితో రష్యా నుంచి వచ్చే డీజిల్‌పై ఇప్పటివరకు తమ దేశం విధించిన అన్ని రకాల కఠినమైన ఆంక్షలను 2027 ఏప్రిల్ దాకా పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

ఈ డీల్ వివరాలను ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా అమెరికా ప్రజలతో పంచుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వెంటనే రష్యా నుంచి 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ అమెరికాతో పాటు అంతర్జాతీయ విపణికి సరఫరా అవుతుందని తెలిపారు. అంతటితో ఆగకుండా రాబోయే నవంబర్ నెలలో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను, ఆ తర్వాత వెంటనే అదనంగా ఇంకో 10 లక్షల టన్నుల డీజిల్‌ను మాస్కో తమకు వేగంగా పంపిస్తుందని చెప్పారు. అంతేకాకుండా రష్యాలోని ఆయిల్ రిఫైనరీల పనితీరు, ఉత్పత్తుల సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో అత్యల్ప కాలంలోనే మరో 30 లక్షల టన్నుల వరకు డీజిల్‌ను రష్యా తమకు అందించేందుకు ఒప్పుకుందని ట్రంప్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Also Read : ఢిల్లీలో హైటెన్షన్.. ప్రముఖ యూట్యూబర్‌తో పాటు అభిజీత్ దీప్కే అరెస్టు?