Cockroach Janata Party (CJP) founder Abhijeet Dipke
Cockroach Janata Party (CJP) founder Abhijeet Dipke

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిజీత్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఆయన నాయనమ్మ సావిత్రిబాయి దీప్కే (85) మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.

ఢిల్లీ పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని.. అక్టోబర్ 10లోపు రిజైన్ చేయకపోతే.. నిరసన ఉదృతం చేస్తామని CJP తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో CJP మద్ధతుదారులు భారీగా ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిజీత్ దీప్కే ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఆయనతో పాటు CJP సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కూడా ఉన్నారు. అయితే వారు ప్రయాణించిన విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎప్పుడైతే ల్యాండ్ అయిందో.. అప్పుడే ఢిల్లీ పోలీసులు విమానంలోకి వెళ్లి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అభిజీత్ దీప్కే పోలీసుల అదుపులో ఉండటంతో.. తన నాయినమ్మను ఆఖరిచూపు చూసేందుకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అభిజీత్ తల్లిదండ్రులు అనితా, భగవాన్ దీప్కే ఈ విషాద వార్త తెలిసిన వెంటనే వారు హింగోలికి బయల్దేరారు.