
Smit Machchhar : ఫ్లై దుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమానంలో జరిగిన గొడవ తర్వాత విమానం ఒక్కసారిగా కిందకు దిగి, మళ్లీ సౌదీ అరేబియా వైపు తిరిగినట్లు సమాచారం.
ఫ్లై దుబాయ్ విమానం FZ1073 సెప్టెంబర్ 30న ఉదయం 7.05 గంటలకు దుబాయ్ నుంచి బయలుదేరింది. భారతీయుడైన కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఈ విమానాన్ని నడుపుతున్నారు. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దాడిలో కెప్టెన్ తలకు, చేతులకు లోతైన గాయాలయ్యాయి.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 850 మంది ఔట్!
ఘటన తర్వాత విమానంలో ఉన్న ఇతర ఫ్లై దుబాయ్ పైలట్లు విమానాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సౌదీ అరేబియాలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న తబుక్‌లోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ విమానాశ్రయంలో ఉదయం 10.45 గంటల సమయంలో సురక్షితంగా దించారు. ఆ తర్వాత కో-పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు.
భారతీయ పైలట్‌పై దాడి జరగడం, విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు సంబంధించి 2016 నాటి విమాన హైజాకింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, అలాగే 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ 16, సెక్షన్ 15(1)(a) కింద నేరాలు జరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఉన్న ఆరోపణలు NIA చట్టం పరిధిలోకి వస్తుండటంతో, జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలు NIA చట్టంలోని సెక్షన్ 6(5), 6(8), సెక్షన్ 8 ప్రకారం జారీ అయ్యాయి. విమానంలో అసలు ఏం జరిగింది? కెప్టెన్‌పై దాడి చేయడానికి కారణమేంటి? దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే విషయాలపై NIA విచారణ చేపట్టనుంది. అయితే, కో-పైలట్ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం, దాడికి ముందు విమానంలో ఏం జరిగిందనే వివరాలను కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో వెల్లడించలేదు.
Also Read : ఢిల్లీలో CJP నిరసనలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి!









