
నేటి విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవడం వల్ల పిల్లల్లో సొంత ఆలోచనా శక్తి రోజురోజుకూ క్షీణిస్తోంది. డిజిటల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, చీగ్ గ్లోబల్ నివేదికల ప్రకారం హోంవర్క్, సైన్స్ ప్రాజెక్టులు, కోడింగ్ వరకు ప్రతిదానికీ యంత్రాలపైనే ఆధారపడే అలవాటు పెరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పూర్తిగా తగ్గిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యార్థుల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. శాతాల పరంగా బ్రిటన్ ముందంజలో ఉన్నప్పటికీ, వినియోగదారుల సంఖ్యలో భారత్‌దే అగ్రస్థానం. దేశంలో ఉన్న సుమారు 4.3 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల్లో ఏకంగా 3.5 కోట్ల మంది నిత్యం ఏఐ టూల్స్‌పైనే ఆధారపడుతున్నారు.
ఈ అలవాటు వల్ల విద్యార్థులు సొంతంగా పరిశోధించే తత్వాన్ని కోల్పోతున్నారు. 60 శాతం మంది విద్యార్థులు ఏఐ ఇచ్చే ఫలితాలను సరిచూసుకోకుండానే నేరుగా అసైన్మెంట్లుగా సమర్పిస్తున్నారు. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివే అలవాటు బాగా తగ్గడంతో పాటు వారి జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు పావువంతు తగ్గిపోతున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్ చదివే పిల్లలకు ఈ షార్ట్‌కట్ పద్ధతి పెద్ద శాపంగా మారుతోంది. ఆటోమేటిక్ కోడింగ్ సాధనాల్ని వాడటం వల్ల సొంతంగా లాజిక్ అలోచించే సామర్థ్యం తగ్గి, క్యాంపస్ ఇంటర్వ్యూలలో సగం మంది దాకా విఫలమవుతున్నారు. పైగా ఏఐ అందించే తప్పుడు సమాచారాన్ని కూడా గుర్తించలేక ప్రాజెక్టులలో అలాగే వాడేస్తున్నారు.
ఈ సమస్యకు ఏఐని నిషేధించడం మార్గం కాదని, విద్యా విధానంలో మార్పులు తెచ్చి పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాతపూర్వక ప్రాజెక్టుల కంటే తరగతి గదిలోనే ప్రత్యక్ష ప్రెజెంటేషన్లు, వైవాలు నిర్వహించాలి. ఏఐ ఇచ్చిన సమాధానాల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలి. అలాగే రోజూ కూడా కొంత సమయం డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండి సొంతంగా ఆలోచించేలా విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. లేకపోతే పిల్లలు రోజురోజుకు మొద్దుబారిపోతారని నిపుణులు అంటున్నారు.









