
ఇటీవల నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరదలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. అక్కడ కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడ్డాయి. ఈ హఠాత్ వరదల దెబ్బకు ఊళ్లకు ఊళ్లే నీట మునిగిపోయాయి. ఎటు చూసినా కూలిపోయిన ఇళ్లు, వరద నీరే కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. గోర్ఖా జిల్లాలోని సల్లెరి బజార్ ఈ అకస్మాత్తు వరదలకు పూర్తిగా కొట్టుకునిపోయింది.
నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు..
ఉధృతంగా ప్రవహిస్తున్న బుధిగండకి నది..
వరదలో కొట్టుకుపోయిన గోర్ఖాలోని సల్లెరి బజార్..
నది ప్రవాహంలో విరిగిపడిన కొండ చరియలు..
ఫ్లాష్ ఫ్లడ్స్‌తో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం..
#nepal #floods https://t.co/DIOOg8SLr0
— citizenspulse (@citizenspulse01) October 11, 2026
అక్కడున్న బుధిగండకి నది ఉధృతంగా పొంగిపొర్లుతోంది. ప్రవాహం తీవ్రతకు నది ఒడ్డున ఉన్న కొండచరియలు పెద్ద ఎత్తున విరిగిపడ్డాయి. ఆ నీరు, మట్టి ఒక్కసారిగా ఊరిపైకి రావడంతో పదుల సంఖ్యలో ఇళ్లు, షాపులు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఈ భయంకర ప్రళయంతో వేలాది మంది ఇళ్లు లేక వీధిన పడ్డారు. ప్రాణాలు దక్కించుకోవడానికి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.









