
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులో పర్యటించి.. ఆ రాష్ట్రానికి నిధుల వర్షం కురిపించారు. ఏకంగా రూ.13వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి.. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో మెట్రో ఫేజ్ 2, రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, పోర్టులు, లూబ్రికెంట్ బేస్ స్టాక్ ప్రాజెక్ట్, మానవ మెదళ్ల 3D మ్యాప్ల శాస్త్రీయ మిషన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ రూ.13వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్లో.. రూ.4,900 కోట్లు మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ పనులకు వెచ్చించారు. ఇందులో పూనమల్లి నుండి వడపళని వరకు ఉన్న మెట్రో ఫేజ్-2 లైన్ను మోదీ ప్రారంభించారు.
అలాగే రూ.3,700 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా NH-744లోని వడుగపట్టి-తేర్కువెంగనల్లూరు సెక్షన్ను, మదురై రింగ్ రోడ్లోని మరో సెక్షన్ను ప్రారంభించారు. ఇంకా తిరువారూర్ బైపాస్కు శంకుస్థాపన చేశారు.
రూ.750 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. కారైకల్-పెరళం రైలు మార్గం, కోయంబత్తూరు చుట్టూ 3 రైలు ఫ్లైఓవర్లు, 5 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు.
అలాగే చెన్నై పోర్టులో కార్గో స్టోర్ సౌకర్యాలు, 4 గిడ్డంగులు, ఒక నావికుల క్లబ్, ఒక క్రూయిజ్ టెర్మినల్ను లాంచ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా వి.ఓ. చిదంబరనార్ పోర్టులో 8 ప్రాజెక్టులను, కామరాజర్ పోర్టులో కోల్ బెర్త్-3ను మోదీ ప్రారంభించారు.
అంతేకాకుండా చెన్నైలోని మనాలి రిఫైనరీలో సుమారు రూ.1,620 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లూబ్రికెంట్ బేస్ స్టాక్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు.
ఐఐటి మద్రాస్లోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్లో 100కు పైగా మానవ మెదళ్ల 3D మ్యాప్లను రూపొందించే శాస్త్రీయ మిషన్ను ప్రారంభించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం తన సంస్కృతి స్ఫూర్తితో ముందుకు సాగుతోందని తెలిపారు. విజ్ఞాన శాస్త్రంలో పురోగతి, నూతన సౌకర్యాలు ప్రజలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, సీఎం విజయ్ సహా నాయకులు హాజరయ్యారు.









