
తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే రంగు రంగుల పూల పండుగ బతుకమ్మ వేడుకలు విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా.. తమ ఆచార పండుగలను మర్చిపోరని దుబాయ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకలు మరోసారి నిరూపించాయి. సరిహద్దులు వేరైనా.. సంద్రాలు దాటినా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాలు ఇంచుకూడా తగ్గలేదని అక్కడి తెలంగాణ ప్రజలు మరోసారి తెలియజేశారు.
దుబాయ్‌లోని ప్రసిద్ధ అల్ ఆహ్లి స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో 16వ బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణల్లో.. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలతో హోరెత్తిస్తున్నారు. కోలాటాలు, ఆటలు, పాటలతో దుబాయ్ గడ్డపై తెలంగాణ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలో ప్రముఖులు కూడా పాల్గొనడంతో సందడి సందడిగా మారింది. ముఖ్య అతిథులుగా.. కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వీరితో పాటు విశిష్ట అతిథిగా.. దుబాయ్‌లోని ఇండియన్ కన్సుల్ జనరల్ డా. విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో జానపద గాయిని మధుప్రియ, ప్రముఖ జానపద గాయకుడు, రచయిత మాట్ల తిరుపతి తమ పాటలతో తెలంగాణ ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. వారి గీతాలు, బతుకమ్మ పాటలకు ప్రవాస మహిళలు డ్యాన్సులు చేస్తూ అదరగొట్టేశారు.
ఈ అద్భుతమైన సాంస్కృతిక వేడుకకు RTV మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ సంబరాలను LIVE లో చూపిస్తోంది.









