
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణం, అద్భుతమైన, అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు వాహన ప్రియులను ఆకట్టుకోవడంతో ఎక్కువగా ఆసక్తిచూపిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంపెనీలు మార్కెట్లో తమ కార్లను పరిచయం చేస్తున్నాయి. తాజాగా చైనాకి చెందిన కార్ల తయారీ కంపెనీ గీలీ.. వాహనదారులను ఆశ్చర్యపరిచే సరికొత్త ఎస్యూవీను లాంచ్ చేసింది.
అక్టోబర్ 10న ‘‘బ్యాటిల్‌షిప్ 700 ఎస్యూవీ’’ని (Geely Battleship 700) అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు రోడ్లపై నడవడమే కాదు.. ఏకంగా నీటిలో పడవలా తేలుతూ ప్రయాణిస్తుంది. ఇందులో ఆకట్టుకునే సాంకేతికత, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. దీనికి సంబంధించిన సేల్స్ ప్రారంభం కాగా.. కేవలం 12 నిమిషాల్లోనే 10,000కు పైగా ఆర్డర్లు రావడం విశేషం. ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, లగ్జరీ క్యాబిన్, అధునాతన ఆఫ్-రోడ్ సాంకేతికతతో ఈ SUV భారీ ఆదరణ పొందుతోంది.
ఈ Geely Battleship 700 ఎస్యూవీ ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో దీని ప్రారంభ ధర 179,800 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 25.97 లక్షలు.. అలాగే దీని టాప్ వేరియంట్ ధర 369,800 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ. 53.42 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఈ Geely Battleship 700 ఎస్యూవీ వెహికల్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో ‘స్కై ఐ’ లైటింగ్ సిస్టమ్, LED లైట్లు, వెలిగే లోగో ఉంటుంది. దీని పైకప్పుపై అధునాతన సెన్సార్ సిస్టమ్‌లో భాగమైన 192-లైన్ల LiDAR సెన్సార్ కూడా అందించారు. ఇందులో ఐదు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 10.2-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 15.2-అంగుళాల హెడ్-అప్ డిస్ప్లే, 15.4-అంగుళాల 2K సెంట్రల్ టచ్‌స్క్రీన్, 12.66-అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్, వెనుక ప్యాసింజర్ కంట్రోల్ స్క్రీన్ వంటివి అందించారు.
ఇందులో SPA సీట్లు కూడా ఉన్నాయి. 14-పాయింట్ల మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ సదుపాయంతో కూడిన “మార్ష్మల్లౌ” SPA సీట్లు అందించారు. లాంగ్ డ్రైవ్ లేదా క్యాంపింగ్ ప్రియులకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా 18.5-లీటర్ల డ్యూయల్-డోర్ రిఫ్రిజిరేటర్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్, ఆక్సిజన్ జనరేటర్ కూడా ఉన్నాయి. అలాగే ఇందులో CATL తయారు చేసిన 47.14 kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లో సింగిల్ ఛార్జింగ్‌పై 305 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.









