
ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. జలసంధిని తెరవడానికి ఇరాన్ ప్రతిపాదించిన ఏడు కీలక షరతులకు అమెరికా ఇచ్చిన స్పందన అసంతృప్తికరంగా ఉందంటూ ఇరాన్ తిరస్కరించింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్ పంపిన ప్రతిపాదనల్లో తమ కొన్ని షరతులనే అంగీకరించారని, మిగిలిన అంశాలపై స్పష్టత లేదని ఇరాన్ భద్రతా విభాగం తెలిపింది. అమెరికా తన వైఖరిని స్పష్టం చేసే వరకు జలసంధిని తెరిచేది లేదని.. అలాగే ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తి కూడా లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.
Also Read : మసులుతున్న పసిఫిక్ సముద్రం నీళ్లు.. ప్రపంచానికి సూపర్ ఎల్‌నినో ప్రళయం ముప్పు తప్పదా?
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదవ వంతు వాటా కలిగిన ఈ జలమార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. జూన్ నెలలో కుదిరిన స్వల్పకాలిక ఒప్పందాన్ని విస్తరించి హోర్ముజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అలాగే హోర్ముజ్ జలసంధి వివాదంతో పాటు అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. ఆంక్షల సడలింపు కోసం అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం తమ తక్షణ ప్రాధాన్యత హోర్ముజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడం మాత్రమేనని, అణు అంశంపై వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై స్పందిస్తూ ఈ సంఘర్షణ త్వరలోనే ముగిసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల కంటే ముందు ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయబోమని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో తమ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇరాన్ మరింతగా ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరించారు.
Also Read : ఇక ప్రపంచం అంతం.. 2100 నాటికి మనుషులు ఉండరు.. లాన్సెట్ నివేదికలో షాకింగ్ విషయాలు!









