
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. మనిషి సృష్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు భూగోళం వేడెక్కుతుంటే.. మరోవైపు సముద్రాలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోతుండటం శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపెడుతోంది. రోజురోజుకు మునుపెన్నడూ లేనంతగా ఎల్‌నినో తీవ్రరూపం దాల్చుతున్నది. దీని ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం నీరు వేడెక్కుతోందని.. ఇది భవిష్యత్తులో పెను విపత్తులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్.. ఆ దేశాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ బ్యాన్!
🚨NEW: The Pacific is heating up at an alarming rate, with temperatures in a key El Niño region reportedly reaching 6.1°F above average.
Scientists warn this could fuel the strongest El Niño ever recorded. https://t.co/64MidTxbtu
— Dustbin (@Dustbintheory) October 11, 2026
ఎల్‌నినోలో ‘నినో 3.4’ జోన్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ఏకంగా 29.70 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన 1982-83, 1997-98 అలాగే 2015-16 సంవత్సరాల నాటి తీవ్రమైన ఎల్‌నినోల గరిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరుకోవడం రాబోయే రాక్షస ఎల్‌నినో ముప్పునకు స్పష్టమైన సంకేతమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ మరింత ఊహించని, ప్రమాదకరమైన స్థాయికి చేరుకోనుందని ప్రపంచ వాతావరణ సంస్థ అధికారికంగా హెచ్చరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు ఈ ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని, దీనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్ సాలో తెలిపారు. 1950వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు నమోదైన బలమైన, శక్తివంతమైన ఎల్నినోలలో ఇది ఒకటిగా నిలవనుందని పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రత ఏకంగా 21.05 డిగ్రీల సెల్సియస్‌కు చేరడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిమితిని రాబోయే కొద్ది సంవత్సరాల్లో దాటడం ఖాయమని, దీనివల్ల భూమిపై జీవకోటికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సూపర్ ఎల్‌నినో ప్రభావం దేశంపై అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మన దేశంలో నైరుతి రుతుపవనాల గమనాన్ని, వర్షపాతాన్ని ఎల్‌నినో పూర్తిగా శాసిస్తుంది. సాధారణంగా దీని ప్రభావం వల్ల దేశంలో వర్షాలు తగ్గిపోయి కరువు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అందుకు తగినట్టే 2026 నైరుతి రుతుపవనాల కాలం ముగిసేసరికి దేశవ్యాప్తంగా సగటున 12.6 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉండాల్సి ఉండగా, ఈసారి కేవలం 759.4 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఇది 2015 తర్వాత దేశంలో నమోదైన తక్కువ వర్షాకాలం అని చెప్పవచ్చు.
ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 25.6 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా రాబోయే అక్టోబర్ నెలలో కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ తక్కువ వర్షపాతం రాబోయే రబీ పంటల సాగుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. దేశంలో పంటల దిగుబడి తగ్గిపోయి, ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం ముప్పు భారీగా పెరుగుతుందని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్‌నినో వల్ల ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు పెను వరదల ముప్పును మరింత తీవ్రతరం చేస్తోంది. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తూ సృష్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్‌కు తోడు ఈ సూపర్ ఎల్‌నినో కూడా తోడవడంతో రాబోయే కాలంలో వాతావరణ మార్పులు మరింత వేగవంతం కానున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also Read : ఘోరాతి ఘోరం: పడవ బోల్తా.. చిన్నారుల సహా 109 మంది మృతి, 116 మంది గల్లంతు..!









