
Rajinikanth : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినా.. బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజులను ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం కంటే బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడే తనకు ఎక్కువ సంతోషంగా ఉండేదని వెల్లడించారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం సాధారణంగా నిర్వహించే ఆడియో లాంచ్‌కు బదులుగా చిత్ర బృందం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రికార్డ్ చేసి సన్ నెక్ట్స్‌లో ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌తో పాటు నెల్సన్, సినిమా నటీనటులు, సాంకేతిక బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్సన్.. రజనీకాంత్‌లోని నిరాడంబరత గురించి ప్రశ్నించారు.
దీనికి రజనీకాంత్ స్పందిస్తూ.. నేను పెద్ద స్టార్‌ను అయినప్పటికీ నాకు నటన అంటే చాలా ఇష్టం. కానీ అంతకంటే ఎక్కువగా బస్ కండక్టర్‌గా పనిచేయడాన్ని ఇష్టపడేవాడిని. ఐదేళ్ల పాటు కండక్టర్‌గా పనిచేశాను. ఆ రోజులు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. ఆ ఉద్యోగాన్ని చాలా మిస్ అవుతున్నాను. నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా భావించుకోలేను అని చెప్పారు.
తాను తరచూ బెంగళూరుకు వెళ్లడానికి కూడా ఇదొక కారణమని రజనీకాంత్ తెలిపారు. “ఈ స్టార్డమ్ అంతా బాగానే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే.. నన్ను నేను ఒక కండక్టర్‌గానే ఎక్కువగా భావిస్తాను. బస్ కండక్టర్లు రకరకాల మనుషులతో మాట్లాడుతుంటారు. వాళ్లతో కలిసి పనిచేస్తారు. అందుకే నన్ను నేను ఇప్పటికీ కండక్టర్‌గానే గుర్తించుకుంటాను. ఒక బస్ కండక్టర్‌గా పనిచేసిన నేను.. మీలాంటి పెద్ద వ్యక్తి ముందు ఎలా ప్రవర్తిస్తాను?” అంటూ నెల్సన్‌తో సరదాగా మాట్లాడారు.
రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన బెంగళూరులో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రామకృష్ణ మఠంలో వేదాలు నేర్చుకున్నారు. అక్కడే ఆధ్యాత్మిక భావాలు అలవడ్డాయి. మఠంలో జరిగే నాటకాల్లో పాల్గొనడంతో నటనపై ఆసక్తి పెరిగింది. చదువు పూర్తయ్యాక కూలీగా, బస్ కండక్టర్‌గా సహా పలు పనులు చేశారు. ఆ తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే దర్శకుడు కె. బాలచందర్ ఆయనను గుర్తించారు.
శివాజీ గణేశన్‌తో పేరు విషయంలో గందరగోళం రాకుండా ఉండేందుకు ఆయనకు ‘రజనీకాంత్’ అనే పేరు పెట్టారు. సినిమాల్లో నటించడానికి తమిళ భాషను కూడా నేర్చుకున్నారు. అలా సాధారణ బస్ కండక్టర్‌గా మొదలైన ఆయన ప్రయాణం.. భారతీయ సినిమాల్లోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగే స్థాయికి చేరింది









