Saudi Arabia : సౌదీ అరేబియా.. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు ఉన్న దేశాల్లో ఇది ఒకటి. సైన్యం కోసం ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులను కొనుగోలు చేసింది. ప్రపంచంలో అత్యధికంగా సైన్యం కోసం ఖర్చు చేసే దేశాల్లో సౌదీ ఎనిమిదో స్థానంలో ఉంది. అయినా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారుల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. డ్రోన్లు, క్షిపణులతో హౌతీలు పదేపదే దాడులు చేస్తుండటంతో సౌదీ రక్షణ వ్యవస్థలోని లోపాలు బయటపడుతున్నాయి. ఇంత బలమైన సైన్యం ఉన్నా సౌదీ ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది? హౌతీల దాడులను అడ్డుకోవడం ఎందుకు కష్టంగా మారింది? సౌదీ అరేబియా ఇటీవల టర్కీ, పాకిస్థాన్‌లతోనూ రక్షణ ఒప్పందాలు చేసుకుంది. అయితే, సైన్యానికి అవసరమైన ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ఇతర దేశాల నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది. ఈ ఆయుధాల కొనుగోలు ద్వారా ఇతర దేశాలతో తన సంబంధాలను కూడా బలోపేతం చేసుకుంటోంది.

Also Read : ట్రంప్‌ కోరుకుంటున్న మార్పు.. జెలెన్‌స్కీ స్థానంలో ఎవరు? రేసులో ఆరుగురు!

హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?

హౌతీలు యెమెన్‌లోని పెద్ద ప్రాంతంపై నియంత్రణ కలిగి ఉన్నారు. 2014లో యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తమ ఆయుధ శక్తిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వేల సంఖ్యలో యోధులతో పాటు డ్రోన్లు, క్షిపణులను ఉపయోగిస్తూ సౌదీకి సవాల్ విసురుతున్నారు. యెమెన్ నుంచి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ వరకు తమ డ్రోన్లు, క్షిపణులను పంపగలమని హౌతీలు నిరూపించారు. సౌదీలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు వంటి కీలక ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హౌతీల వద్ద పాలస్తీన్‌-2, తూఫాన్ వంటి మధ్యశ్రేణి క్షిపణులు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు బుర్కాన్, బదర్ రకం తక్కువ దూరం వెళ్లే క్షిపణులను కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు, హౌతీలు ఒకేసారి ఒకే రకమైన ఆయుధంతో దాడి చేయడం లేదు. వేర్వేరు వేగాలతో వెళ్లే డ్రోన్లు, క్షిపణులను కలిపి ప్రయోగిస్తున్నారు. దీంతో వాటిని గుర్తించి అడ్డుకోవడం రక్షణ వ్యవస్థలకు మరింత కష్టంగా మారుతోంది.

సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థలో ఉన్న ప్రధాన సమస్యల్లో దేశ విస్తీర్ణం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. సుమారు 22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకేసారి పూర్తి రక్షణ కల్పించడం చాలా కష్టం. సౌదీ రక్షణ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోగలుగుతోంది. అయితే, దేశం చాలా పెద్దది కావడంతో ప్రతి దాడిని ప్రతిసారీ అడ్డుకోవడం సాధ్యం కాదు. పేట్రియాట్, థాడ్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ దేశమంతటా ఎలాంటి దాడి జరగకుండా అడ్డుకునే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నిపణలు అంటున్నారు. రాజధాని రియాద్‌తో పాటు విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలు, పవిత్ర నగరాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలన్నింటికీ నిరంతరం రక్షణ కల్పించాల్సి ఉంటుందని అంటున్నారు.

హౌతీల దాడులు పదేపదే జరుగుతుండటంతో సౌదీ రక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే అడ్డుకోవడానికి ఉపయోగించే ఆయుధాల నిల్వలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆయుధాల కొరత ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సౌదీ సైన్యం అనేక దాడులను అడ్డుకుంటున్నప్పటికీ, కొన్ని క్షిపణులు మాత్రం లక్ష్యాలను చేరుకుంటున్నాయి. ముఖ్యంగా చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.

సౌదీ, హౌతీల మధ్య ఉద్రిక్తతలకు యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ప్రధాన కారణం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తోంది. మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు దేశంలోని కొన్ని ప్రాంతాలపై తమ పట్టును కొనసాగిస్తున్నారు.
ఇటీవల హౌతీలు ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సౌదీ తన సైనిక చర్యలను పెంచింది. యెమెన్‌లోని హౌతీల ఆధీనంలో ఉన్న సనా విమానాశ్రయంపై సౌదీ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. దీనికి ప్రతిగా సౌదీపై దాడులు చేయడం ద్వారా తమకు ఎదురవుతున్న పరిస్థితులనే సౌదీ కూడా ఎదుర్కోవాలని హౌతీలు భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

హౌతీల లక్ష్యం ప్రతిసారీ సౌదీ రక్షణ వ్యవస్థను దాటుకుని దాడి చేయడం మాత్రమే కాదు. అప్పుడప్పుడు ఒక్క దాడి విజయవంతమైనా తమ సామర్థ్యాన్ని చాటుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీలక ప్రాంతాలపై పదేపదే దాడులు చేయడం ద్వారా సౌదీపై ఒత్తిడి పెంచుతున్నారు.
సౌదీ అరేబియా కొన్నేళ్లుగా యెమెన్ యుద్ధం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తోంది. కానీ హౌతీల దాడులతో శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కీలక ప్రాంతాలపై దాడులు చేస్తూ, శాంతి నెలకొనాలంటే సౌదీ చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందనే సంకేతాన్ని హౌతీలు ఇస్తున్నారని జూనో అభిప్రాయపడ్డారు.

Also Read : డబ్బు కోసం కన్నబిడ్డలనే అమ్మేసిన తల్లులు.. కామాంధుల చేతుల్లో పసిపాపల నరకయాతన!

రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. సుమారు 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయం నగర కేంద్రానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం సౌదీకి చాలా కీలకం. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2030 ప్రణాళికలో భాగంగా రియాద్‌ను పర్యాటకులు, అంతర్జాతీయ కంపెనీలు, ప్రపంచస్థాయి కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా మార్చాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి సమయంలో విమానాశ్రయంపై దాడులు జరగడం ఆర్థికంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది.

విమానాశ్రయంపై దాడుల వల్ల సౌదీ సైనిక శక్తి వెంటనే తగ్గిపోకపోవచ్చు. కానీ పదేపదే దాడులు జరగడం వల్ల దేశ భద్రతపై ప్రజల్లో భయం పెరగడంతో పాటు వ్యాపారాలు, పెట్టుబడులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడులు సౌదీలో పదేళ్లకు పైగా కాలంలో జరిగిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఒకటిగా నిలిచాయి.  శనివారం జరిగిన దాడిలో 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. రియాద్‌లో జరగాల్సిన ప్రపంచ ఇంధన సదస్సుకు ముందు ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగించింది. గతంలో దాడులు జరగబోతున్నప్పుడు అధికారులు ప్రజలకు ఫోన్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపేవారు. అయితే, ఇటీవల అలాంటి హెచ్చరికలు ఆగిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. మొత్తంగా చూస్తే.. అత్యాధునిక ఆయుధాలు, భారీ సైనిక బడ్జెట్ ఉన్నంత మాత్రాన ప్రతి దాడిని అడ్డుకోవడం సాధ్యం కాదని సౌదీ పరిస్థితి చూపిస్తోంది. దేశ విస్తీర్ణం, హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడులు, రక్షణ ఆయుధాల కొరత.. ఇవన్నీ సౌదీకి సవాలుగా మారాయి. అదే సమయంలో, ఈ దాడులు సౌదీ భద్రతతో పాటు ఆర్థిక లక్ష్యాలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.