Amit Shah :  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. సర్ పేరుతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటములను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా SIR కారణమా? అని ప్రశ్నించారు. 2024 తర్వాతే SIR ప్రక్రియ మొదలైందని, కానీ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోందని అమిత్ షా అన్నారు.

గుజరాత్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 44 స్థానాలకు గాను 38 స్థానాలను గెలుచుకుంది. గాంధీనగర్ అమిత్ షా లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అలాగే థారా, ఓఖా మున్సిపాలిటీల్లోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.

మరోవైపు, మంగళవారం రాహుల్ గాంధీ ప్రతిపక్ష INDIA కూటమి నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు హై టీ ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి బలోపేతం చేయడమే తమ నిరసనల లక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ మీడియా సమావేశం ముగిసిన కొద్దిసేపటికే అమిత్ షా స్పందించారు. గుజరాత్ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తున్నారని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఓట్ల శాతం 10 శాతం పెరిగిందని తెలిపారు. గాంధీనగర్‌లో కాంగ్రెస్‌కు 41 ఏళ్లుగా ఒక్క ఎన్నికలో కూడా విజయం దక్కలేదని అమిత్ షా అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గుర్తించాలని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతంలో కూడా ఒక్క ఎన్నిక గెలవలేకపోవడంపై ఆ పార్టీ ఆలోచించుకోవాలని సూచించారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ఓటములకు కారణాలను వెతుక్కోవడం కంటే, ప్రజలు ఎందుకు తమ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదో కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని అన్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల కార్యకర్తలను ఒకచోట చేర్చి, పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించినంత మాత్రాన దేశ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేరని అమిత్ షా విమర్శించారు. దేశ ప్రజల అభిప్రాయం పొలాల్లో పనిచేసే రైతులు, గ్రామాల్లో నివసించే ప్రజలు, మారుమూల కొండ ప్రాంతాలు, అడవులు, నదీ తీరాల్లో ఉండే ప్రజల దగ్గర ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌కు ఆయా ప్రాంతాల్లో ప్రజలతో సరైన సంబంధాలు లేవని ఆరోపించారు.

బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని అమిత్ షా అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాల వల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలకు బీజేపీ, ఎన్డీయే కూటమి మరోసారి భారీ ఓటమిని చూపిస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.