ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ, అవసరమైన ఫారమ్‌లు, సెక్యూరిటీ డిపాజిట్ల వివరాలు తెలియాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వేర్వేరు స్థానాలకు వేర్వేరు ఫారమ్‌లు, డిపాజిట్ మొత్తాలు అమల్లో ఉంటాయి.

నామినేషన్‌కు అవసరమైన కీలక ఫారమ్‌లు
పోటీ చేసే పదవిని బట్టి ప్రతి అభ్యర్థి క్రింది నామినేషన్ ఫారమ్‌లను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి (RO) సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఫారమ్ 2A దాఖలు చేయాలి. మండల పరిషత్ స్థానానికి పోటీ చేసేవారు ఫారమ్ 2B, జిల్లా పరిషత్ స్థానాలకు పోటీ పడే అభ్యర్థులు ఫారమ్ 2C నింపాల్సి ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల అభ్యర్థులు ఫారమ్-B సమర్పించాలి.

గుర్తింపు పొందిన లేదా నమోదిత రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు పార్టీ అధ్యక్షుడి నుంచి లభించే ఫారమ్-A, అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్-Bలను నామినేషన్ల చివరి రోజు మధ్యాహ్నం 3:00 గంటల లోపు తప్పనిసరిగా అందించాలి. దీనితో పాటు ప్రతి అభ్యర్థి తమ ఆస్తులు, అప్పులు, నేరపూరిత రికార్డులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్‌ను ఫారమ్-26 రూపంలో నోటరీ ఎదుట ప్రమాణం చేసి జతపరచాలి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ఏజెంట్ కోసం ఫారమ్-8, పోలింగ్ రోజున కేంద్రాల్లో ఉండే పోలింగ్ ఏజెంట్ కోసం ఫారమ్-10, కౌంటింగ్ ఏజెంట్ కోసం ఫారమ్-12ను సమర్పించాల్సి ఉంటుంది.

సెక్యూరిటీ డిపాజిట్ వివరాలు
పోటీ చేసే ప్రతి అభ్యర్థి నిర్దేశిత డిపాజిట్ మొత్తాన్ని చలానా లేదా నగదు రూపంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సగం రాయితీ ఉంటుంది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థానానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2,000 నుంచి రూ. 3,000 వరకు డిపాజిట్ చెల్లించాలి. రిజర్వ్‌డ్ (SC, ST, BC) వర్గాల అభ్యర్థులకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉంటుంది.

అలాగే ఎంపీటీసీ స్థానానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500 డిపాజిట్‌గా నిర్ణయించారు. జెడ్పీటీసీ (ZPTC) స్థానాలకు జనరల్ అభ్యర్థులు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు రిజర్వ్‌డ్ అభ్యర్థులు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించాలి. ఇక మున్సిపల్ కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ స్థానాలకు జనరల్ అభ్యర్థులకు రూ.2,500 నుంచి రూ. 5,000 వరకు ఉండగా రిజర్వ్‌డ్ వర్గాల వారికి రూ.1,250 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. అయితే ఎన్నికల్లో పోలైన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు సాధించకపోతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము జప్తు అవుతుంది.

నామినేషన్ దాఖలు చేసే సమయంలో వయస్సు, గుర్తింపు ఆధారాల కోసం టెన్త్ మార్కుల మేమో లేదా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జతచేయాలి. అలాగే స్థానిక సంస్థలకు పన్నులు బాకీ లేవని తెలిపే నో-డ్యూస్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం అందించాలి. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల లోపు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు.