
Pakistan : పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్లో ఓ ప్రైవేట్ స్కూల్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 28 మంది విద్యార్థులు, ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
పెషావర్లోని లోపలి నగర ప్రాంతమైన దిర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో విద్యార్థులు, సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని పెషావర్ డిప్యూటీ కమిషనర్ అఫాక్ వజీర్ ఆదేశించారు.
లేడీ రీడింగ్ ఆస్పత్రి ప్రతినిధి మహమ్మద్ ఆసిమ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఆరుగురు బాలికలు కూడా ఉన్నారు. చనిపోయిన పిల్లలందరి వయసు 13 ఏళ్లు లేదా అంతకంటే తక్కువే. ప్రమాదంలో 40 మందికి పైగా గాయపడటంతో ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కూలిపోయిన భవనం శిథిలాలను తొలగిస్తూ, వాటి కింద ఇంకా ఎవరైనా విద్యార్థులు లేదా స్కూల్ సిబ్బంది చిక్కుకున్నారా అని వెతుకుతున్నారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు, టీచర్ కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా గవర్నర్ ఫైసల్ కరీమ్ కుండీ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.









