Mother Of All Bombs : వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వర్గాలు ఒక సంచలన ఆప్షన్‌ను పరిశీలిస్తున్నాయి. ఇరాన్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ను టార్గెట్ చేయడానికి అమెరికా తన అత్యంత శక్తివంతమైన సంప్రదాయ ఆయుధమైన GBU-43/B Massive Ordnance Air Blast (MOAB)ను ఉపయోగించే అవకాశం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

Also Read : మొదటి ప్రధాని హత్యకు 75 ఏళ్లు.. నేటికీ వీడని రహస్యాలు!

అసలేమిటీ MOAB?

2000వ దశకం ఆరంభంలో US ఆర్మీ కోసం అభివృద్ధి చేసిన ఈ బాంబును GPS గైడెన్స్‌తో గాలి నుంచి ప్రయోగిస్తారు. సుమారు 9,800 కేజీల బరువు, 9.1 మీటర్ల పొడవు ఉండే ఈ బాంబులో దాదాపు 8,480 కేజీల ఎక్స్‌ప్లోజివ్స్ ఉంటాయి. న్యూక్లియర్ వెపన్స్ తరహాలో రేడియోధార్మికతను విడుదల చేయకుండా, సంప్రదాయ పేలుడు పదార్థాలతోనే ఇది ఉపరితలంపై తీవ్రమైన ఎయిర్ బ్లాస్ట్‌ను సృష్టిస్తుంది. 1991 గల్ఫ్ వార్‌లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వాడిన “Mother of all battles” అనే పదబంధం ప్రేరణతో పాటు, దీని భారీ సైజు కారణంగా దీనికి “మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్” అనే పాపులర్ నిక్‌నేమ్ వచ్చింది.

గతంలో ఎక్కడ ప్రయోగించారు?

యూఎస్ మిలిటరీ తొలిసారిగా MOABను ఏప్రిల్ 13, 2017న ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్‌లో ISIS-K సొరంగాల నెట్‌వర్క్‌పై ప్రయోగించింది. భూగర్భంలో ఉన్న గుహలు, టన్నెల్ కాంప్లెక్స్‌లను భారీ షాక్‌వేవ్‌లతో ధ్వంసం చేయడంలో ఇది తన సత్తాను నిరూపించుకుంది.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. డ్రాగన్ డబుల్ గేమ్.. హౌతీల హైపర్‌సోనిక్ మిస్సైల్స్‌తో అగ్రరాజ్యానికి ముప్పు?

ఇరాన్‌పై ప్రయోగం సాధ్యమేనా?

ఇరాన్‌పై దీనిని వాడటం అంత సులభం కాదని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. MOAB ఉపరితల లక్ష్యాలపై ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ, కొండల లోపల లోతైన గ్రానైట్ రాళ్ల కింద నిర్మించిన భూగర్భ అణు స్థావరాలను ఇది ఎంతవరకు ఛేదించగలదన్న దానిపై సందేహాలు ఉన్నాయి. పైగా దీని భారీ బ్లాస్ట్ రేడియస్ వల్ల సివిలియన్లకు జరిగే నష్టం, తద్వారా తలెత్తే తీవ్ర ప్రతీకార చర్యల ముప్పును మిలిటరీ ప్లానర్లు అంచనా వేస్తున్నారు.

గతంలో మీడియా ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఆధారంగా ఒక్కో బాంబుకు 16 మిలియన్ డాలర్లు అవుతుందని పేర్కొన్నప్పటికీ, యూఎస్ ఎయిర్ ఫోర్స్ దీని అసలు యూనిట్ తయారీ ఖర్చు దాదాపు 170,000 డాలర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇరాన్‌పై దీని మోహరింపు కేవలం పరిశీలన దశలోనే ఉన్న వ్యూహాత్మక ప్రత్యామ్నాయం మాత్రమే.