
Pulivendula : ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా పులివెందులలో పోలీసుల కాల్పుల ఘటన కలకలం రేపాయి. పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని, దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై, పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
Also Read : జనసేనకు నాలుగు కార్పొరేషన్లు ఫిక్స్? తిరుపతి దగ్గరే అసలు ట్విస్ట్!
నిన్న పుంగనూరు. నేడు పులివెందుల. నామినేషన్ కేంద్రం వద్ద కర్రలు, కత్తులతో వందల మంది టీడీపీ కార్యకర్తలు. గాల్లోకి కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం. ఒక నామినేషన్ కేంద్రం వద్ద పట్టపగలు వందల మంది కర్రలు, కత్తులతో ఉంటే వారిని మాత్రం తరిమివేయని పోలీసులు. https://t.co/rlBptxXFuZ
— Ramanath B R (@JOURNORAMNATH) October 17, 2026
మరో వైపు ప్రకాశం జిల్లా దర్శిలోనూ నామినేషన్ల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థుల పత్రాలను టీడీపీ శ్రేణులు లాక్కొని చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఇక కడపలోని మరియాపురం నామినేషన్ కేంద్రం దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడిపై కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనలో మురాద్ బాషాతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ జరుగుతున్న ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రానున్న ఐదు రోజులు ఈ జిల్లాలో భారీ వర్షాలు!









