
AP Local Body Elections : కర్నూలు మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు ఇప్పుడు మేయర్ పీఠం కోసం ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. వైసీపీ తరఫున సుశీల, కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా విజయ ప్రత్యూష పోటీ చేస్తున్నారు. దీంతో కర్నూలు మేయర్ ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. విజయ ప్రత్యూష సోదరి ప్రియాంక.. సుశీల కుమారుడు భార్గవ్‌ను వివాహం చేసుకున్నారు. అంటే ప్రియాంక, భార్గవ్ పెళ్లి తర్వాత సుశీల, ప్రత్యూష కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. ఆరేళ్ల కిందట జరిగిన ఈ పెళ్లితో వీరిద్దరూ అత్తాకోడళ్ల వరస అయ్యారు. ఇప్పుడు అదే బంధుత్వంలో ఉన్న ఇద్దరూ రాజకీయంగా మాత్రం ఎదురెదురుగా నిలబడ్డారు. మేయర్ పదవి కోసం ఒకరి మీద ఒకరు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఎన్నిక కర్నూలు రాజకీయాల్లో ప్రత్యేకంగా మారింది.
కర్నూలు మేయర్ సీటును కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. దీంతో టీడీపీ మాజీ కార్పొరేటర్ విజయ ప్రత్యూషను అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె గతంలో ఐదేళ్ల పాటు కార్పొరేటర్‌గా పనిచేశారు. పార్టీ తరఫున స్థానికంగా మంచి పరిచయం ఉండటంతో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ కూడా కర్నూలు మేయర్ అభ్యర్థిగా ఉతకళ్ల సుశీల పేరును ప్రకటించింది. మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో సుశీలను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సుశీల మాజీ ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ భార్య. ఆమెకు ఇదే మొదటి రాజకీయ ఎన్నిక.
Also Read : 11 ఏళ్ల తర్వాత కోల్‌కతాలో మళ్లీ అదే విషాదం.. 2015లో ఏం జరిగిందంటే?
అయితే టీడీపీ, వైసీపీ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కావడంతో కర్నూలులో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఒకవైపు ఇప్పటికే రాజకీయాల్లో అనుభవం ఉన్న విజయ ప్రత్యూష ఉండగా.. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుశీల ఉన్నారు.
ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కర్నూలు నగరపాలక సంస్థలో మొత్తం 68 వార్డులు ఉన్నాయి. మేయర్ పదవితో పాటు ఈ వార్డుల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజే మేయర్ పదవికి రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కూటమిలో కర్నూలు మేయర్ సీటు టీడీపీకి దక్కడంతో విజయ ప్రత్యూష ప్రచారంపై దృష్టి పెట్టారు. తాజాగా ఆమె మంత్రి టీజీ భరత్‌ను కలిసి ఎన్నికల ప్రచారం, నగర రాజకీయ పరిస్థితులు, గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఇక వైసీపీ ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. కర్నూలుతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు వంటి నగరాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది.
Also Read : ఎన్నికల బరిలో TDP మాస్టర్ ప్లాన్: 22 స్థానాలతో రెండో జాబితా విడుదల.. ఊహించని పేర్లు!









