
ICC Womens U19 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదలైంది. జనవరి 21 నుంచి ఫ్రిబ్రవరి 6వ తేదీ వరకు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. ఈ టోర్నీకి బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో మొత్తం 16 టీంలు పాల్గొననుండగా.. 41 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను ఐర్లాండ్, నేపాల్, వెస్టిండీస్ టీంలతో గ్రూప్ ‘ఎ’లో ఉంచారు.
ఈ గ్రూప్ – ఎలో భాగంగా భారత జట్టు జనవరి 22న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడుతుంది. అయితే పాకిస్తాన్ జట్టు గ్రూప్ ‘బి’లో ఉండటంతో.. గ్రూప్ దశలో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడలేవు.
16 teams 👊
41 matches 🏏The ICC Women’s T20 #U19WorldCup 2027 fixtures are confirmed 🤩
More ➡️ https://t.co/atd1WxBfo1 https://t.co/qJm6ynKda4
— ICC (@ICC) October 21, 2026
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు జనవరి 21న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. నేపాల్ జట్టు జనవరి 22న ఐర్లాండ్‌తో తన మొదటి మ్యాచ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లు రెండు దేశాల్లోని నాలుగు స్టేడియాల్లో జరగనున్నాయి. అందులో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉన్న బీర్ శ్రేష్ఠ షహీద్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ క్రికెట్ స్టేడియం, సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు ఆడనున్నారు. అలాగే నేపాల్ రాజధాని కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అప్పర్ ముల్పానీ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో మరికొన్ని మ్యాచ్‌లు కొనసాగించనున్నారు.
గ్రూప్ దశ మ్యాచ్‌లు జనవరి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. అందులో అర్హత సాధించిన జట్లు ఆ తర్వాత సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అక్కడ వాటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
టోర్నమెంట్ గ్రూపులు:
గ్రూప్ ఎ- భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్
గ్రూప్ బి- దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సమోవా
గ్రూప్ సి- ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ
గ్రూప్ డి- ఇంగ్లాండ్, శ్రీలంక, యూఎస్ఏ, స్కాట్లాండ్









