JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటే.. ఆయన పేరుతో ఉన్న మరో వాన్స్ ఇప్పుడు మెక్సికో వైపు దూసుకెళ్తోంది. మెక్సికో పశ్చిమ తీరానికి సమీపంలోని పసిఫిక్‌ సముద్రంలో ఏర్పడిన వాన్స్ తుఫాను శుక్రవారం హరికేన్‌గా బలపడింది. దీంతో సోషల్ మీడియాలో జేడీ వాన్స్ పేరుతో సరదా మీమ్స్, జోకులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ హరికేన్‌కు జేడీ వాన్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ తుఫానుకు వాన్స్ అనే పేరు ముందే నిర్ణయించిన జాబితా ప్రకారం వచ్చింది. ఈ పేర్ల జాబితాను WMO ముందుగానే సిద్ధం చేస్తుంది. అంతకుముందు మెక్సికో పసిఫిక్ తీరానికి సమీపంలో ఏర్పడిన ట్రూడీ తుఫాను కూడా బలపడి హరికేన్‌గా మారింది. దాని తర్వాత జాబితాలో ఉన్న పేరు వాన్స్ కావడంతో ఈ తుఫానుకు ఆ పేరు పెట్టారు.

ప్రపంచంలోని వివిధ సముద్ర ప్రాంతాలకు తుఫాన్ల పేర్ల కోసం వేర్వేరు జాబితాలు ఉంటాయి. తూర్పు ఉత్తర పసిఫిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో తుఫాన్ల పేర్లను అక్షరాల క్రమంలో పెడతారు. ఇందులో మగ, ఆడ పేర్లను మారుస్తూ ఉపయోగిస్తారు. ఈ పేర్ల జాబితాలను సాధారణంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి మళ్లీ ఉపయోగిస్తారు. అంటే ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు వార్తల్లో ఉన్నారనే దానితో తుఫాను పేర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. ముందే సిద్ధం చేసిన జాబితాలో ఏ పేరు తర్వాత ఉంటే అదే పేరును తుఫానుకు పెడతారు.

అయితే జేడీ వాన్స్ పేరు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో బాగా వినిపిస్తుండటంతో.. వాన్స్ పేరుతో హరికేన్ రావడం సోషల్ మీడియా యూజర్లకు మంచి మీమ్ మెటీరియల్‌గా మారింది. కొందరు సరదాగా జేడీ వాన్స్‌కు కొత్త హరికేన్ బాధ్యతలు వచ్చాయని కామెంట్లు చేశారు. మరికొందరు వాన్స్ పేరుతో వచ్చిన ఈ తుఫానుపై తమదైన శైలిలో జోకులు చేశారు. కొంతమంది ఏకంగా జేడీ వాన్స్ ముఖాన్ని హరికేన్‌ మధ్య భాగంలో పెట్టి ఫొటోలను ఎడిట్ చేశారు. దీంతో జేడీ వాన్స్‌నే హరికేన్‌ మధ్యలో ఉన్నట్టుగా కనిపించేలా మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే వాన్స్ అనే పేరు ఈ ప్రాంతానికి కొత్తేమీ కాదు. 2014లో కూడా ఇదే పేరుతో ఒక హరికేన్ ఏర్పడింది. అది నవంబర్‌లో కేటగిరీ-2 స్థాయికి బలపడింది. ఆ తర్వాత బలహీనపడి తీరాన్ని తాకకుండానే ముగిసింది. అంతకుముందు 1990లో కూడా మెక్సికో పసిఫిక్ తీరానికి సమీపంలో వాన్స్ పేరుతో మరో తుఫాను ఏర్పడింది. అది కూడా భూమిని తాకలేదు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.