Cyclone Arnab : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ సహాయక చర్యల కోసం ప్రభావిత 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు అదనపు నిధులు కేటాయించింది. బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది.

పునరావాస కేంద్రాలు, తాగునీరు, ఆహారం, పాలు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య పనులతో పాటు రోడ్లు, సాగునీటి శాఖకు సంబంధించిన అత్యవసర మరమ్మతులకు ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రపై కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి కోస్తాంధ్రలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి.

కాకినాడ జిల్లాలో పరిస్థితిని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రేపు, ఎల్లుండి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు 80 వేల మందిని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆరు తీర ప్రాంత మండలాలతో పాటు మరో ఐదు మండలాల్లో అలెర్ట్ ప్రకటించారు. ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉండటంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అర్నబ్ తుఫాన్ గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తుఫాన్ ప్రభావం కోనసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంత జిల్లాల అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.