ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులకు ‘ఎల్‌నినో’ ప్రధాన కారణం అవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ ఉష్ణోగ్రతల మార్పుల ప్రభావం భూమిపై ఉన్న అన్ని దేశాల వాతావరణంపై తీవ్రంగా పడుతుంది. దీనివల్ల వర్షాలు తగ్గడం, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటం, అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం జరుగుతుంటాయి. అయితే కేవలం ప్రకృతి మాత్రమే కాకుండా.. ఎల్‌నినో ప్రభావం నేరుగా మానవ ఆరోగ్యంపై కూడా తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో వచ్చే ఈ హఠాత్ మార్పుల వల్ల మన శరీరం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వేసవి కాలం ముగిసేలోపు ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరడం వల్ల ‘హీట్ వేవ్స్’ విపరీతంగా పెరుగుతాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక డీహైడ్రేషన్ బారిన పడటం, ఒంటి నొప్పులు రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు సాధారణంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వడదెబ్బ తగిలి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

Also Read : యూట్యూబ్‌కి ఇన్‌స్టా బిగ్ షాక్.. ఇకపై 90 నిమిషాల లాంగ్ వీడియోలు.. ఓటీటీలా మారనున్న సోషల్ మీడియా!

ఎల్‌నినో కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం లేదా సరైన సమయానికి వర్షాలు కురవకపోవడం వల్ల తాగునీటి కొరత తలెత్తుతుంది. దీనివల్ల ప్రజలు కలుషితమైన నీటిని తాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కడుపులో ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కాలేయ సంబంధిత పచ్చకామెర్లు వంటి నీటి ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధులు వేగంగా ప్రబలుతాయి. పరిశుభ్రత లోపించిన చోట ఈ వ్యాధులు మహమ్మారిలా విస్తరించే అవకాశం ఉంది.

అంతేకాకుండా వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులు దోమల సంతానోత్పత్తికి ఎంతో అనుకూలంగా మారుతాయి. నిల్వ ఉన్న నీటిలో దోమలు విపరీతంగా పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజలను వణికిస్తాయి. ముఖ్యంగా వర్షాలు లేకపోయినా నీటిని నిల్వ చేసుకునే విధానాల వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగి ఆసుపత్రులలో రోగుల తాకిడి భారీగా పెరుగుతుంది.

వాతావరణంలో తేమ శాతం, ఉష్ణోగ్రతలలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా గాలి నాణ్యత కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఆస్తమా ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ముక్కు నుంచి నీరు కారడం, అలర్జీలు, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి. ఎండ వేడికి తోడు గాలిలో కాలుష్య కారకాలు కలవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి ఇబ్బందులు సర్వసాధారణం అవుతాయి.

ఇలా శారీరక ఆరోగ్య సమస్యలతో పాటు ఎల్‌నినో ప్రభావం మానసిక ఆరోగ్యంపైనా పడుతుంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి, పంటలు పండక నష్టపోవడం వల్ల రైతులు, సామాన్య ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పకటికప్పుడు తగినంత నీరు తాగుతూ, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా ఎల్‌నినో ముప్పు నుంచి బయటపడవచ్చు.

Also Read : అందుకు రాజీనామా తప్పు కాదు.. MLAల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు