కర్ణాటకలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ముగియడంతో ఎన్నికల సంఘం మంగళవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్‌పై విపక్షాలు మొదటినుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఎలక్షన్ కమిషన్ ఈ రివిజన్‌ను పూర్తి చేసి ఫైనల్ లిస్ట్‌ను అనౌన్స్ చేసింది. ఈ రివిజన్ ప్రాసెస్‌లో ఏకంగా 1.08 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను లిస్ట్ నుంచి తొలగించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ తొలగింపుతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో 5.54 కోట్లుగా ఉన్న మొత్తం ఓటర్ల కౌంట్, తాజా జాబితా ప్రకారం 4.54 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న తుది జాబితా డేటాను పరిశీలిస్తే:

మహిళా ఓటర్లు: 2,29,12,355 (2.29 కోట్లు)
పురుష ఓటర్లు: 2,25,40,493 (2.25 కోట్లు)
థర్డ్ జెండర్ ఓటర్లు: 2,841 మంది
యువ ఓటర్లు (18-19 ఏళ్ల వయస్సు): 6.83 లక్షలకు పైగా

ప్రత్యేకంగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే కాస్త ఎక్కువగా నమోదైంది. తుది జాబితా ప్రిపరేషన్ సమయంలో సుమారు 1,08,76,625 ఎన్యూమరేషన్ ఫారాలను పలు సాంకేతిక కారణాల వల్ల పరిగణనలోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. అలాగే రూల్స్ ప్రకారం నోటీసులు జారీ చేసి, అధికారికంగా విచారణ నిర్వహించిన అనంతరం 61,867 మంది ఓటర్లను ఫైనల్ లిస్ట్‌కు అనర్హులుగా నిర్ధారించారు.

డ్రాఫ్ట్ లిస్ట్ గణాంకాల ప్రకారం.. ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియ మొదలుకాకముందు ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 19.48 శాతం మంది (1,07,96,339 మంది) వివరాలను ఎన్యూమరేట్ చేయలేకపోయారు. డూప్లికేట్ ఎంట్రీలు, అడ్రస్ మార్పులు, మరణాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తున్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో పేర్లు తొలగించడంపై విపక్షాలు మరిన్ని ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.