
ఇజ్రాయెల్ ఎన్నిక(Israeli Parliamentary Elections) ల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి, ప్రధాన ప్రతిపక్షానికి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆ దేశ రాజకీయ భవిష్యత్తు అస్థిరంగా మారింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 53 సీట్లకే పరిమితమయ్యే అవకాశముంది. మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ 48 సీట్లను గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే అరబ్ పార్టీలకు 19 సీట్లు దక్కుతాయని సమాచారం. అయితే మొత్తం 120 సీట్లున్న పార్లమెంటు నెస్సెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 సీట్లు ఉండాలి. ప్రతిపక్షం, అరబ్ పార్టీలు సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒకవేళ కలిస్తే మాత్రం మొత్తం 67 సీట్లు అవుతాయి. అప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది.
ఇజ్రాయెల్‌లోని అరబ్ పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు భారీ విజయ సాధించి, తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే కింగ్‌మేకర్ స్థానంలో నిలిచాయి. ఎన్నికల ఫలితాల అనంతరం టెల్ అవీవ్‌లో యూదులు, అరబ్బులతో కలిసిన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఇజ్రాయెల్ మొత్తం జనాభాలో అరబ్బులు 20 శాతం ఉన్నారని, వారిని భాగస్వామ్యం చేయకుండా లేదా ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా దేశంలో మార్పు సాధ్యం కాదని నిరసనకారులు స్పష్టం చేశారు. వారి ప్రాతినిధ్యాన్ని రాజకీయ నాయకులు ఒక ఉచ్చుగా కాకుండా సమస్యల పరిష్కార మార్గంగా చూడాలని వారు డిమాండ్ చేశారు.
Also Read : సొంత జనరల్స్పైనే ట్రంప్ వేటు.. ఇరాన్‌పై దాడికి ముందు.. అసలు కారణమేంటి?
ఈ ఎన్నికల్లో విశేష ప్రతిభ కనబరిచిన రెండు ప్రధాన అరబ్ పార్టీలలో యూసఫ్ జబారిన్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్, మన్సూర్ అబ్బాస్ నేతృత్వంలోని రామ్ పార్టీలు ముఖ్యమైనవి. యూసఫ్ జబారిన్ నేతృత్వంలోని ఈ కూటమి నెతన్యాహు ప్రభుత్వాన్ని దించేందుకు తమ సీట్లను ఉపయోగిస్తామని ప్రకటించింది. అయితే గాజా సైనిక చర్యలు, దక్షిణ లెబనాన్ ఆక్రమణకు మద్దతిచ్చిన ప్రభుత్వాల్లో నేరుగా చేరబోమని అరబ్ సమాజ భద్రత, సమానత్వం వంటి డిమాండ్లను నెరవేరిస్తే బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. 52 ఏళ్ల దంతవైద్యుడైన మన్సూర్ అబ్బాస్ నేతృత్వంలోని రామ్ పార్టీ, దేశీయ పౌర సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని చర్చలకు ముందస్తు షరతుగా పెట్టకుండా అరబ్ పౌరుల మౌలిక సదుపాయాలు, నేరాల అదుపు, విద్యా అవకాశాలపై దృష్టి సారించింది.
ఇజ్రాయెల్‌లో దాదాపు 2.1 మిలియన్ల మంది అరబ్ పౌరులు నివసిస్తున్నారు. వీరు దేశ పౌర వ్యవస్థలో ముఖ్యంగా వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని మొత్తం వైద్యులలో 20% కంటే ఎక్కువ మంది, నర్సులలో 25% మంది, ఫార్మసిస్టులలో సగానికి పైగా అరబ్బులే ఉన్నారు. అలాగే సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా, ఇంజనీర్లుగా, పండితులుగా వారు సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. గతంలో అరబ్ నేతలకు పరిమిత ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వారి రాజకీయ ప్రభావం గణనీయంగా పెరిగింది.
అరబ్ పార్టీల విజయంతో నెతన్యాహుకు చెందిన ‘లికుడ్ పార్టీ’ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అరబ్ పార్టీలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ ఓటర్లను బెదిరించి, లంచాలు ఇచ్చి, నిషేధిత సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను మేనేజ్ చేశాయని ఆరోపించింది. ఈ ఎన్నికల అక్రమాలపై ఇజ్రాయెల్ దేశీయ భద్రతా సంస్థ అయిన షిన్ బెట్, పోలీసులతో సమగ్ర విచారణ జరిపించాలని లికుడ్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం గైర్హాజరు ఓట్లు, ఐడీఎఫ్ సైనికుల ఓట్లకు సంబంధించిన డబుల్ ఎన్వలప్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడిన తర్వాతే ఇజ్రాయెల్‌లో నెతన్యాహు అధికారం నిలబడుతుందా లేదా అరబ్ పార్టీల మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది తేలనుంది.
Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్: రాత్రిపూట ఛార్జింగ్ బంద్









