రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ్’. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది. స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మైథలాజికల్ మూవీ క్రేజ్ మనదేశంలోనే కాకుండా పొరుగు దేశమైన పాకిస్తాన్‌లోనూ దుమ్మురేపుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ అక్కడి హిందూ కమ్యూనిటీ సభ్యులు వేడుకలు నిర్వహించారు. పాటలు, డప్పుల మోతలతో ‘రామాయణ్’ సినిమా పోస్టర్లను చేతిలో పట్టుకుని వీధుల్లో ర్యాలీగా తిరిగారు.

అనంతరం కరాచీలోని ప్రసిద్ధ లక్ష్మీ నారాయణ ఆలయానికి చేరుకుని సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలుపారు. దీంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సృష్టించాలని, ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ విజువల్ వండర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదలవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.