దక్షిణ అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని కారణంగా రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడనుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు అంటే సోమవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు.. నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు పాటించాలని తెలిపారు. శుక్రవారం అంటే రేపు అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని.. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే శనివారం.. విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది.

ఇక ఆదివారం రోజున కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పోలవరం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు.. అలాగే అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది.

సోమవారం.. పోలవరం జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని ప్రజలను అలర్ట్ చేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.