డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు ఎంతో ఆర్భాటంగా ట్రంప్ టి1 ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించారు. ఈ ఫోన్ కంప్లీట్ అమెరికా గడ్డపైనే తయారైందని.. మేడ్ ఇన్ ది యూఎస్ఏ ట్యాగ్‌తో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉందని ప్రచారం చేశారు. అయితే ప్రముఖ టెక్ యూట్యూబర్ జాక్ నెల్సన్ ఈ ఫోన్‌ను స్క్యూడ్రైవర్లతో విడదీసి చూసినప్పుడు.. దీని వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ట్రంప్ సోదరులు 2025 జూన్‌లో ఈ మొబైల్‌ను ప్రకటించిన సమయంలో ఎలాంటి అధికారిక సరఫరా గొలుసు సమీక్ష లేకుండానే భారీ అంచనాలను పెంచేశారు. అమెరికాలోనే ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లు, 120Hz OLED డిస్‌ప్లేలు రాత్రికి రాత్రే తయారు చేయడం సాధ్యం కాదని నిపుణులు ముందు నుంచీ అనుమానిస్తున్నారు. T1 ఫోన్ స్పెసిఫికేషన్లలో 6.78-అంగుళాల డిస్‌ప్లే, 12GB RAM, 256GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ ఉంటాయని చెప్పారు. కానీ జాక్ నెల్సన్ ఈ ఫోన్‌ను పూర్తిస్థాయిలో గమనించినప్పుడు అసలు డ్రామా మొదలైంది.

Also Read : సొంత జనరల్స్‌పైనే ట్రంప్ వేటు.. ఇరాన్‌పై దాడికి ముందు.. అసలు కారణమేంటి?

జాక్ నెల్సన్ ఈ ఫోన్‌కు స్క్రాచ్, బెండ్ టెస్టులు నిర్వహించగా ఫోన్ మన్నిక బాగానే ఉన్నప్పటికీ.. వెనుక ప్యానెల్ తీసి లోపలి భాగాలను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అందులోని మదర్‌బోర్డు, బ్యాటరీ అమరిక, మోడల్ నంబర్‌లు అన్నీ 2024లో విడుదలైన తైవాన్ కంపెనీ HTC U24 Pro ఫోన్‌ను ఖచ్చితంగా పోలి ఉన్నాయి. మేడ్ ఇన్ యూఎస్ఏ అని మార్కెటింగ్ చేసిన ఈ ఫోన్ వాస్తవానికి ఒక పాత హెచ్‌టీసీ మిడ్-రేంజ్ మొబైల్‌ను రీబ్రాండ్ చేసి అమ్మడమేనని స్పష్టమైంది.

ఈ విషయాన్ని నిరూపించడానికి జాక్ ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఆయన ట్రంప్ T1 మదర్‌బోర్డ్‌ను తీసి HTC U24 Pro లో అమర్చగా.. అలాగే HTC మదర్‌బోర్డ్‌ను ట్రంప్ ఫోన్‌లో పెట్టగా రెండూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ అయ్యి పనిచేశాయి. కెమెరా సెన్సార్లు, హెడ్‌ఫోన్ జాక్, బటన్ల అమరిక సైతం మిల్లీమీటర్ తేడా లేకుండా సరిగ్గా సరిపోయాయి. కేవలం ట్రంప్ లోగో ఉన్న బంగారు రంగు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ మాత్రమే ఈ ఫోన్‌కు మార్చారని తేలింది.

సాధారణ మార్కెట్‌లో 470 డాలర్లకు (దాదాపు రూ. 44,756) లభించే ఒక సాధారణ HTC U24 Pro ఫోన్‌ను తీసుకుని.. దానికి ట్రంప్ అని బ్రాండింగ్ వేసి ఏకంగా 749 డాలర్ల (దాదాపు రూ. 71,324) ధరకు విక్రయిస్తున్నారు. అంటే ఎలాంటి కొత్త టెక్నాలజీ లేదా స్పెసిఫికేషన్లు పెంచకుండా కేవలం వెనుక ప్యానెల్‌పై ఉన్న లోగో, బంగారు రంగు డిజైన్ కోసం కస్టమర్ల నుంచి అదనంగా 280 డాలర్లు (సుమారు రూ. 26,664) గుంజుతున్నారు.

అంతేకాకుండా అసలైన HTC ఫోన్‌లో ఉండే 60W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్ నుండి తీసేసి తక్కువ క్వాలిటీ ఛార్జింగ్‌నే అందిస్తున్నారు. మేడ్ ఇన్ యూఎస్ఏ అని భారీగా ప్రచారం చేసి పాత ఫోన్‌నే కొత్తదిగా అమ్మడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఇజ్రాయెల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: కింగ్‌ మేకర్‌గా అరబ్ పార్టీలు