ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికా ఊహించని విధంగా తమ సైనికులకు ఒక విచిత్రమైన శిక్షణ ఇస్తోంది. సాధారణంగా శత్రువులను ఎలా మట్టుబెట్టాలో నేర్పించే సైన్యానికి.. ఇప్పుడు సొంత సామూహిక సమాధులు ఎలా తవ్వాలో ఆర్మీ(US Army) అధికారులతో ప్రత్యక్షంగా డ్రిల్స్ చేయిస్తున్నారు. యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయిన తమ దేశ సైనికులను వేగంగా గుర్తించడం, అక్కడికక్కడే తాత్కాలికంగా సమాధులు ఏర్పాటు చేసి వారికి అంత్యక్రియలు నిర్వహించడంపై ఈ ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు.

యుద్ధభూమిలో భారీ బుల్డోజర్లు, ఆధునిక యంత్రాలను ఉపయోగించి క్షణాల్లో తాత్కాలిక ఖనన స్థలాలను ఏ విధంగా సిద్ధం చేయాలో సైనికులకు నేర్పిస్తున్నారు. సైనికుల మృతదేహాలు పాడవకుండా భద్రపరిచి, సురక్షితంగా తిరిగి అమెరికాకు పంపేంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో వివరిస్తున్నారు. సమాచారం ప్రకారం.. 1950-53 నాటి కొరియా యుద్ధం తర్వాత అమెరికా సైన్యం ఇలాంటి సంచలనాత్మక సమాధుల డ్రిల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. నాటి కొరియా యుద్ధంలో దాదాపు 36,515 మంది అమెరికా సైనికులు మరణించగా, 7,245 మంది బందీలుగా చిక్కుకున్నారు. ఇప్పుడు అంతకుమించిన మహా యుద్ధం రాబోతోందనే సంకేతాలతోనే అమెరికా ఈ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోందని భావిస్తున్నారు.

Also Read : సొంత జనరల్స్‌పైనే ట్రంప్ వేటు.. ఇరాన్‌పై దాడికి ముందు.. అసలు కారణమేంటి?

ఒకవేళ యుద్ధంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురై, ఏకకాలంలో వందలాది మంది సైనికులు మరణిస్తే.. ప్రతి ఒక్కరికీ విడివిడిగా సమాధి తవ్వడం సాధ్యం కాదు. అందుకే ఒక్కో భారీ గోతిలో కనీసం 100 మృతదేహాలను ఉంచేలా పెద్ద సమాధులను తవ్వుతున్నారు. మొత్తంమీద 2 వేలకు పైగా సైనికుల మృతదేహాలను ఒకే సమయంలో ఖననం చేసేలా అమెరికా ఆర్మీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకరమైన శిక్షణా తరగతుల వార్తలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు పశ్చిమాసియాలో ఇరాన్‌పై అతిపెద్ద సైనిక చర్యకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి సిద్ధమవుతుందన్న నేపథ్యంలో ఈ సమాధుల శిక్షణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాబోయే భయంకరమైన యుద్ధంలో అమెరికా బలగాలకు కూడా ఊహించని స్థాయిలో ప్రాణనష్టం తప్పదా అనే తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన వారిలో కనీసం 22 మంది అమెరికా సైనికులు మరణించారని ప్రచారం జరుగుతుండగా.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ వార్తలను ఖండించారు.

Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్: రాత్రిపూట ఛార్జింగ్ బంద్