
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా కాలానికి దిశను నిర్దేశించే మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ముగిసింది. ఒహాయో, జార్జియా, నార్త్ కరోలినా తదితర ప్రాంతాల్లో వెలువడుతున్న ప్రాథమిక ఫలితాలు అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలను సూచిస్తున్నాయి. రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న పలు కీలక స్థానాల్లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా ఒక సెనేట్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్రతినిధుల సభ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు బలమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, నిరుద్యోగం, ఇరాన్‌పై యుద్ధం వంటి కీలక అంశాలపై అమెరికా ప్రజల్లో రిపబ్లికన్ విధానాలకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న అసంతృప్తే ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.
ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, 100 సెనేట్ స్థానాల్లో 35 సీట్లు, అలాగే 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఈ ఎన్నికలు జరిగాయి. ఉభయ సభలపై పట్టు సాధించడానికి డెమోక్రాట్లకు హౌస్‌లో కేవలం మూడు సీట్లు, సెనేట్‌లో నాలుగు సీట్లు గెలిస్తే సరిపోతుంది. ప్రస్తుతం అందుతున్న అంచనాల ప్రకారం డెమోక్రాట్లు హౌస్‌లో స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్లు కనుక ప్రతినిధుల సభను కోల్పోతే ట్రంప్ తెచ్చే చట్టాలను అడ్డుకోవడానికి, ఆయన పరిపాలనపై విస్తృత దర్యాప్తులు చేపట్టడానికి డెమోక్రాట్లకు పూర్తి అధికారం లభిస్తుంది. అదేవిధంగా సెనేట్‌లో ఓటమి పాలైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులను నియమించే ట్రంప్ సామర్థ్యానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది.
Also Read : అమెరికా బాంబులకి ఇరాన్ వణుకు.. పౌరులకు ఇరాన్ 24 గంటల డెత్-వార్నింగ్ జారీ!
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం జార్జియా నుంచి డెమోక్రాట్ జాన్ ఓసాఫ్ యూఎస్ సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. అలాగే నార్త్ కరోలినా మాజీ గవర్నర్ రాయ్ కూపర్, రిపబ్లికన్ అభ్యర్థిపై విజయం సాధించి ఆ రాష్ట్రంలోని సెనేట్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. న్యూ హాంప్‌షైర్, డెలావేర్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, మసాచుసెట్స్ తదితర రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు తమ ప్రాబత్వాన్ని నిలుపుకున్నారు. మరోవైపు ఫ్లోరిడా వంటి కొన్ని ప్రాంతాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. గవర్నర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు సత్తా చాటారు. ఇల్లినాయిస్ గవర్నర్‌గా జెబి ప్రిట్జ్కర్, మసాచుసెట్స్‌లో మౌరా హీలీ, మేరీల్యాండ్‌లో వెస్ మూర్, పెన్సిల్వేనియాలో జోష్ షాపిరో ఘన విజయం సాధించి తమ పదవులను నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల సరళిపై హౌస్ డెమోక్రటిక్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ.. దేశం ఒక నాటకీయమైన మార్పు అంచున ఉందని, డెమోక్రాట్లు ప్రతినిధుల సభపై తిరిగి నియంత్రణ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రిపబ్లికన్ వర్గాలు మాత్రం ఈ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల సరళి ఇలా ఉంటే ఒకవేళ రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను అంగీకరించడానికి ట్రంప్ నిరాకరిస్తారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ తన పాలనను గట్టిగా సమర్థించుకున్నారు. వలసల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలు, ఇరాన్‌తో యుద్ధం, టారిఫ్‌ల విధింపు ద్వారా అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. అయితే న్యూయార్క్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ యంత్రాలు పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎన్నికల ప్రక్రియ, ఫలితాల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయాల్లో సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా ఉన్నాయి.
Also Read : ఒహాయో గవర్నర్ పోరులో సంచలనం.. డెమోక్రాట్ అమీ ఆక్టన్ చేతిలో వివేక్ రామస్వామికి ఘోర పరాజయం!









