ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులో ఇటీవల ఒక దిగ్భ్రాంతికర సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గోపిక అనే బాలికపై హేమంత్ అనే ఉన్మాది ఎలక్ట్రికల్ రంపంతో దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్కూల్ రూమ్‌లోకి చొరబడి ఈ దాడికి పాల్పడటం మరింత చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఆ ఉన్మాది నుంచి తన స్నేహితురాలు గోపికను కాపాడటానికి లక్ష్మి అనే తోటి విద్యార్థిని తన ప్రాణాలకు తెగించి అడ్డుపడి తీవ్రంగా గాయపడింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా లక్ష్మి ప్రదర్శించిన ధైర్యసాహసాలు, స్నేహబంధం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి.

Also Read : ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. కొత్త రూల్ తీసుకొచ్చిన సర్కార్.. వివరాలివే!

నెటిజన్ విజ్ఞప్తి

ఇంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించిన లక్ష్మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై నరసింహస్వామి అనే ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘లక్ష్మి నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక. ఆమె తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. ఆమె సోదరి వికలాంగురాలు కావడంతో.. లక్ష్మి ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఆమె చదువు నిమిత్తం మహీంద్రా గ్రూప్ నడుపుతున్న ‘నాన్హి కాళీ’ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి’’ అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లారు.

ఆనంద్ మహీంద్రా రియాక్షన్

దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు. నరసింహస్వామి చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ.. లక్ష్మీ చదువు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లక్ష్మి కుటుంబ సభ్యులను సంప్రదిస్తామని.. నాన్హి కాళీ ట్రస్ట్ ద్వారా ఆమె విద్యకు కావలసిన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇస్తూ నారా లోకేష్‌కు ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు.

Also Read : పాక్ మాజీ ప్రధాని జైల్లో ఏడుస్తూ.. నా బెయిల్ వద్దు.. నా భార్యని కాపాడండి

నారా లోకేష్ ధన్యవాదాలు

దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన స్నేహితురాలి ప్రాణాలను కాపాడే క్రమంలో లక్ష్మి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన సాహసం, సమయస్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. లక్ష్మి భవిష్యత్తు కలలను నెరవేర్చడానికి ‘నాన్హి కాళీ ఫౌండేషన్’ ముందుకు రావడం చాలా సంతోషకరమని తెలిపారు.