
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఒకవైపు అమెరికా ఎప్పుడు విరుచుకుపడుతుందోనన్న తీవ్ర భయంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొనడంతో దేశంలోని అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైనా దాడులకు తెగబడొచ్చని.. అణు ప్రమాదం జరిగితే ప్రజలను రక్షించుకునేందుకే ఈ అత్యవసర చర్యలు చేపట్టినట్లు ఇరాన్ అధికారులు స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
యుద్ధానికి, అయోడిన్ టాబ్లెట్లకు సంబంధం ఏంటనే సందేహం రావడం సహజం. అణు కేంద్రాలపై ఒకవేళ వైమానిక దాడులు జరిగితే దాని నుంచి వెలువడే రేడియోధార్మికత గాలిలో కలుస్తుంది. ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మానవ శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై పడి, దాని కణాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు ప్రాణాంతకమైన థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. దీన్ని ముందే గుర్తించిన టెహ్రాన్ ప్రభుత్వం.. అణు స్థావరాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రజలకు ఈ ప్రత్యేక ఔషధాలను పంపిణీ చేస్తూ ప్రాణాలను కాపాడుకునే పనిలో పడింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇరాన్‌పై పూర్తిస్థాయిలో సైనిక చర్యను కొనసాగించాలా వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ తరుణంలోనే ఇరాన్‌లోని పికాక్స్ పర్వత ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన అణుకేంద్రంపై అమెరికా ఎప్పుడైనా విరుచుకుపడొచ్చన్న భయాలు తీవ్రమయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో అమావాస్య కావడంతో రాత్రిపూట చంద్రుడి కాంతి తక్కువగా ఉండే ఈ అంధకారాన్ని ఆసరా చేసుకుని అమెరికా బలగాలు భారీ దాడులకు పాల్పడవచ్చని అంటున్నారు. యుద్ధాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ట్రంప్ స్వయంగా హెచ్చరించడంతో ఇరాన్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
సైన్యం మరోవైపు ఇంటెలిజెన్స్ యుద్ధాన్ని తెరపైకి తెచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన గోప్యమైన సమాచారం అందించే వారికి భారీ నజరానా ప్రకటించింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, కీలక సిబ్బంది, పరికరాల వివరాలు ఇస్తే ఏకంగా 20 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని రివార్డ్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ కింద ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా సమాచారం ఇచ్చిన వారికి సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు అమెరికా సైన్యం ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించింది. శుక్రవారం ఇరాన్‌పై పరిమిత స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. కొన్ని నిమిషాల పాటు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసి దాడులు చేశామని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఈ దాడుల్లో భాగంగా ఖేష్మ్ ద్వీప ప్రాంతంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఎన్నికల్లో ఎదురుదెబ్బల తర్వాత ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు, ఇరాన్ ఇస్తున్న కౌంటర్లు పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పెను విధ్వంసం జరిగేలా కనిపిస్తున్నాయి.









