
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడుతున్నారు. ఎవరితోనైనా చాట్ చేసేటప్పుడు.. అవతలి వ్యక్తి మనకు పంపిన మెసేజ్‌ను మనం చూశామా లేదా అని తెలియజేయడానికి వాట్సాప్‌లో బ్లూ టిక్స్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా మనకు మెసేజ్ పంపిస్తే.. మనం ఆ చాట్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఆ మెసేజ్ కింద నీలం రంగులో రెండు టిక్‌లు కనిపిస్తాయి. దీనివల్ల మనం మెసేజ్ చదివామని అవతలి వారికి ఇట్టే తెలిసిపోతుంది.
అయితే చాలాసార్లు మనం బిజీగా ఉన్నప్పుడు లేదా ఎవరికైనా వెంటనే రిప్లై ఇవ్వలేనప్పుడు మెసేజ్ చూసినా కూడా బ్లూ టిక్స్ పడకూడదని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మనకు నచ్చని వాళ్ల నుంచి లేదా ఇప్పుడే రిప్లై ఇవ్వలేని మెసేజ్ వచ్చినప్పుడు.. అవతలి వారికి తెలియకుండా ఆ మెసేజ్‌ను రహస్యంగా చదవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం ఇప్పటివరకు నోటిఫికేషన్ బార్లో చూసేయడం లేదా మొబైల్ ఇంటర్నెట్, వైఫై ఆఫ్ చేసి మెసేజ్ ఓపెన్ చేయడం వంటి ఎన్నో రకాల ట్రిక్స్ వాడుతుంటారు. కానీ ఇవన్నీ పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త ఫీచర్(WhatsApp New Feature) ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read : పాకిస్తాన్లో చైనా ప్రాజెక్ట్‌కు బిగ్ షాక్: కుప్పకూలిన కాఫర్‌డ్యామ్!
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఒక సరికొత్త పీకబుల్ ప్రివ్యూ విండో ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ యూజర్లు ఎవరికీ తెలియకుండా ఎలాంటి బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్‌లను రహస్యంగా చదివేయవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ ఆపిల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఐఫోన్ యూజర్లు చాట్‌ను కాస్త గట్టిగా నొక్కి పట్టుకోవడం ద్వారా లోపలికి వెళ్లకుండానే కొత్త మెసేజ్‌లను చూసేవారు. ఇప్పుడు అదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కూడా వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ చాట్ జాబితాలోని ఏదైనా సంభాషణను ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే పైన పిన్, ఆర్కైవ్, మ్యూట్, డిలీట్ వంటి ఆప్షన్లతో కూడిన యాక్షన్ బార్ కనిపిస్తుంది. అంతేతప్ప మెసేజ్ లోపల ఏముందో తొంగి చూసే అవకాశం ఉండదు. కానీ రాబోయే కొత్త అప్డేట్లో ఈ విధానం పూర్తిగా మారనుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ చాట్ లిస్ట్‌లో ఉన్న ఏదైనా ఒక చాట్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే వెంటనే ఒక చిన్న ఫ్లోటింగ్ విండో లేదా పాప్-అప్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది. ఆ చాట్‌లో అవతలి వ్యక్తి పంపిన ఇటీవలి మెసేజ్‌లు అన్నీ ఆ విండోలో స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఆ చాట్ థ్రెడ్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండానే కేవలం ఆ ప్రివ్యూ విండో ద్వారానే మెసేజ్‌లన్నీ చదివేయవచ్చు. అయినప్పటికీ అవతలి వారికి మాత్రం ఎలాంటి బ్లూ టిక్స్ పడవు. అంటే మీరు మెసేజ్ చూసిన సంగతి అవతలి వారికి అసలు తెలియనే తెలియదు అన్నమాట.
ఆపిల్ ఫోన్లలో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్నప్పటికీ అక్కడ ఒక చిన్న పరిమితి ఉంది. ఐఫోన్లలో ఆ ప్రివ్యూ విండో ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ పైకి కిందకి స్క్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలం పైన కనిపించే ఒకటి రెండు తాజా మెసేజ్‌లను మాత్రమే చూడగలం. కానీ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరింత అడ్వాన్స్డ్గా దీన్ని తీర్చిదిద్దుతోంది. ఆండ్రాయిడ్ ప్రివ్యూ కార్డ్‌లో యూజర్లు పైకి స్క్రోల్ చేయడానికి కూడా అనుమతి ఉంటుంది. దీనివల్ల కేవలం ఒక్క మెసేజే కాకుండా.. ఆ చాట్ హిస్టరీలో గతంలో వచ్చిన మరిన్ని పొడవైన మెసేజ్‌లను కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా కిందకు జూమ్ చేస్తూ చదువుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఈ కొత్త ప్రివ్యూ విండో కిందే పిన్ చాట్, ఆర్కైవ్, మ్యూట్ నోటిఫికేషన్స్, మార్క్ యాజ్ అన్‌రీడ్, డిలీట్ వంటి క్విక్ యాక్షన్ ఆప్షన్లు కూడా చక్కగా అమర్చి ఉంటాయి. దీనివల్ల యూజర్లు మరింత సులభంగా చాట్లను మేనేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. వాట్సాప్ బీటా టెస్టర్ల కోసం కూడా ఇది పూర్తిగా విడుదల కాలేదు. అయితే దీని కోడ్ పరీక్షిస్తున్న తీరును బట్టి చూస్తే.. రాబోయే కొన్ని వారాల్లోనే ఇది ఆండ్రాయిడ్ స్టేబుల్ వెర్షన్‌కు వచ్చే అవకాశం ఉంది.
Also Read : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. వైట్ హౌస్ దగ్గర టెన్షన్ టెన్షన్!









