చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ, నిఘా వివాదంలో చిక్కుకుంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెన్సన్ హువాంగ్‌కు చైనా కోసం గూఢచర్యం చేస్తోందనే అనుమానాలు ఉన్న ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. జెన్సన్ హువాంగ్ ఆ మహిళతో ఉన్న సంబంధాన్ని అంగీకరించడంతో ఈ వివాదం మరింతమైంది. అయితే ఈ వ్యవహారం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గత ఆరు నెలలుగా తెలుసని.. అయినా కూడా ఆయన జెన్సన్ హువాంగ్‌ను తన చైనా పర్యటనకు వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది.

ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ మధ్య ఉన్న సంబంధం గురించి అమెరికా నిఘా సంస్థలు ముందే సమాచారాన్ని సేకరించాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌కు ఈ విషయంపై అత్యంత రహస్య హెచ్చరిక లేఖ కూడా అందింది. అంతేకాకుండా 2026 మే నెలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో చైనా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీజింగ్ తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానాలున్న ఒక మహిళతో ఎన్‌విడియా అధిపతికి సంబంధాలు ఉన్నాయని విదేశాంగ కార్యదర్శి రూబియో స్వయంగా ట్రంప్‌కు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడి పరివారం అలస్కాలో ఆగినప్పుడు జెన్సన్ హువాంగ్ విమానం ఎక్కి వారితో కలిసి చైనా పర్యటనలో పాల్గొన్నారు.

Also Read : అగ్రరాజ్యంలో వణుకు పుట్టిస్తున్న ఇరాన్.. బంకర్లోకి అమెరికా ఆర్థిక మంత్రి.. అసలు ఏం జరుగుతోంది?

ఈ ఆరోపణలు బయటకు రావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఆకస్మికంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం గురించి తనకు కొద్దిసేపటి క్రితమే తెలిసిందని.. ఆరోపణలపై ఫెడరల్ దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారని ఆయన చెప్పారు. తన విదేశీ పర్యటన సమయంలో ఈ విషయం తనకు తెలియదని ప్రకటిస్తూ వార్తలను ఖండించారు. వైట్ హౌస్ ప్రతినిధి కూడా ఈ కథనాలను కొట్టిపారేస్తూ.. ఈ మూలాలకు అసలు నిజాలు తెలియవని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వార్తా సంస్థలు మాత్రం ట్రంప్‌కు ఈ గూఢచార సమాచారం ముందే తెలుసని ఆధారాలతో సహా పేర్కొన్నాయి.

అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిబంధనలు, చైనాతో వాణిజ్య పరమైన వ్యూహాలలో జెన్సన్ హువాంగ్ అత్యంత కీలకమైన సలహాదారుగా ఉన్నారు. ఇటువంటి కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి చైనా నిఘా విభాగంతో సంబంధాలున్న మహిళను తరచుగా కలవడంపై అమెరికా భద్రతా విభాగాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పరిపాలనలోని సీనియర్ అధికారులు “గ్యాంగ్ ఆఫ్ ఎయిట్” అని పిలిచే కాంగ్రెషనల్ ఇంటెలిజెన్స్ ప్యానెల్ నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. నిజానికి ఈ సమావేశం మధ్యప్రాచ్య పరిస్థితులపై చర్చించడానికి ఏర్పాటు చేసినప్పటికీ హువాంగ్‌కు సంబంధించిన నిఘా నివేదికలపైనే ఎక్కువ చర్చ జరిగింది. అమెరికా జాతీయ భద్రత, సాంకేతిక రహస్యాలు చైనా చేతుల్లోకి వెళ్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఈ వివాదంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న సమాచార సేకరణ, గూఢచార ఆరోపణలు పూర్తిగా నిరాధారమైన ఊహాగానాలు అని కొట్టిపారేశారు. చైనాను అంతర్జాతీయంగా అప్రతిష్టపాలు చేయడానికి, ఎన్‌విడియా లాంటి సాంకేతిక దిగ్గజాలపై ఒత్తిడి పెంచడానికే అమెరికా ఈ తరహా ఆరోపణలు చేస్తోందని చైనా పేర్కొంది.

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం నిజంగా ముగిసిందా? ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం!