హైదరాబాద్ క్యాబ్ మార్కెట్‌లో సరికొత్త పోటీ మొదలైంది. ఢిల్లీ ఎన్సీఆర్ తర్వాత దేశంలోనే రెండో నగరంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ అనుబంధ సంస్థ ‘గ్రీన్ ఎస్‌ఎం’ ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సుమారు 2 వేల ఎలక్ట్రిక్ కార్లతో నగర రోడ్లపైకి దూసుకొచ్చిన ఈ సంస్థ, ఓలా, ఉబర్ వంటి దిగ్గజ అగ్రిగేటర్లకు, ప్రైవేట్ క్యాబ్ ఫ్లీట్ ఓనర్లకు గట్టి పోటీనిస్తోంది.

Also Read : అంతరిక్షం నుంచి నేరుగా ఏపీకి కరెంట్.. చంద్రబాబు చెప్పిన ఈ టెక్నాలజీ ఏంటి?

ప్యాసింజర్లకు బెస్ట్ ఆప్షన్!

సామాన్య ప్రయాణికులకు గ్రీన్ ఎస్‌ఎం క్యాబ్స్ ఎంతో సౌకర్యవంతంగా మారాయి. పీక్ అవర్స్‌లో అధిక ఛార్జీలు లేకపోవడం, కిలోమీటర్‌కు సుమారు రూ.9 తక్కువ ఛార్జీ ఉండటం నగరవాసులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా, 7 సీటర్ వెహికల్స్ అందుబాటులో ఉండటంతో ఫ్యామిలీ మొత్తం ఒకే రైడ్‌లో ప్రయాణించవచ్చు. కారులో ఉచిత వాటర్ బాటిల్స్, వెట్ టిష్యూలతో పాటు సేఫ్టీ కోసం AI ఆధారిత కెమెరాలు, అత్యవసర SOS బటన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్లు కచ్చితంగా 90 శాతం బుకింగ్స్ యాక్సెప్ట్ చేయాల్సిన నిబంధన ఉండటంతో క్యాన్సిలేషన్ తలనొప్పి కూడా తగ్గింది.

డ్రైవర్లకు శాలరీ, బెనిఫిట్స్.. ఫ్లీట్ ఓనర్లకు షాక్!

సొంత కారు లేని డ్రైవర్లకు గ్రీన్ ఎస్‌ఎం ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. రోజుకు 12 గంటల షిఫ్ట్ చేసే డ్రైవర్లకు నెలకు రూ.35 వేల వరకు ఫిక్స్‌డ్ శాలరీతో పాటు ESIC, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, మెయింటెనెన్స్, డైలీ రెంట్ వంటి ఖర్చులు లేకుండా కంపెనీనే ఉచిత ఈవీ ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్ల వల్ల ఇప్పటివరకు కార్లు అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్న ఫ్లీట్ ఓనర్లకు డ్రైవర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

లోకల్ క్యాబ్ అసోసియేషన్ల నిరసన

తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, మరో 10 వేల మంది ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకంతో ఉపాధి కోల్పోయామని, ఇప్పుడు తక్కువ ధరలతో గ్రీన్ ఎస్‌ఎం రావడం వల్ల తమ బుకింగ్స్ పడిపోతాయని లోకల్ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈఎంఐలు కట్టడం కూడా కష్టమవుతుందని, పోటీ తట్టుకోవడానికి మిగతా యాప్స్ ఛార్జీలు తగ్గిస్తే ఆ భారం తమపైనే పడుతుందని డ్రైవర్లు, వాహన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఎస్‌ఎం అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణం, తక్కువ ధరలతో కస్టమర్లకు గ్రీన్ ఎస్‌ఎం వరంగా మారితే, లోకల్ డ్రైవర్లు మరియు ఫ్లీట్ ఓనర్లకు మాత్రం పెను సవాలుగా నిలిచింది.

గ్రీన్‌ SM డ్రైవర్లకు ఇలా..

–> నెలకు సుమారు రూ.35వేలు సంపాదించుకునే అవకాశం

–> ఈఎస్‌ఐసీ/ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌,యాక్సిడెంట్‌ కవరేజీ దేశంలో వర్తించే విధంగా ఉంది

–> రవాణాలో డ్రైవింగ్‌, రోడ్డు భద్రత, కస్టమర్‌ సర్వీస్‌పై పై సమగ్ర శిక్షణ అందిస్తారు

–> సొంతకారు లేకున్నా డ్రైవర్‌గా ఆదాయం గడించొచ్చు

–> పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు లేదు. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లలో ఉచితంగా ఉంటుంది. కంపెనీనే వాటిని భరిస్తుంది

–> మిగిలిన వాహనాల మాదిరిగా రోజువారి అద్దె, వాహన నిర్వహణ భారం ఉండొదు.

–> అయితే నెలజీతం పొందాలంటే నిర్దేశిత పనిగంటలు, ట్రిప్పుల లక్ష్యాలు ప్రస్తుతం లేకున్నా త్వరలో నిబంధనలు వచ్చే అవకాశం ఉందని ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read : పాత పార్టీ పేర్లకు ఫుల్ డిమాండ్.. కవిత బాటలో విజయసాయి రెడ్డి

ప్యాసింజర్ల ప్రయోజనాలు..

* పెట్రోల్‌, డీజిల్‌తో పోలిస్తే కాలుష్యం ఉండదు.7 సీట్ల వాహనంలో ఒకేసారి కుటుంబమంతా ప్రయాణించే అవకాశం ఉంది. మిగిలిన వాటిలో నలుగురికి మించితే అధిక ధర వసూలు చేస్తారు. కానీ ఇందులో ఒకే రైడ్‌లో ఏడుగురు ప్రయాణించొచ్చు.

* గ్రీన్‌ ఎస్‌ఎం కారులో ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ కెమెరాలు, ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థ, అత్యవసర ఎస్‌ఓస్‌ బటన్‌ ఉండటం ప్రయాణికులకు భద్రతపై ధైర్యానిచ్చే అంశంగా ఉంది.

* కారు ప్రయాణంలో గమ్య స్థానం చేరేవరకు కార్లలో తాగునీరు, వెట్‌ టిష్యూలు ఉచితంగా అందిస్తారు.

* చాలా వరకు అధిక ధరలు ఇస్తేనే రైడ్‌లు ఓకే చేసే కంపెనీలకు ధీటుగా గ్రీన్‌ఎస్‌ఎం వాహనాలు పనిచేయనున్నాయి. కచ్చితంగా డ్రైవర్‌ 90 శాతం బుకింగ్‌లు అంగీకరించాల్సి ఉంటుంది.

* లైసెన్స్‌తో పాటు డ్రైవర్‌ కచ్చితంగా 22 ఏండ్ల పైబడి ఉండాలి.

* రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన ఉన్నవారినే కంపెనీ ఎంపిక చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదం తగ్గుతుంది.