CS Karnan :  మాజీ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కన్నుమూశారు. కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడిన తొలి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిగా ఆయన గుర్తింపు పొందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించి, చికిత్సకు స్పందించకపోవడంతో మరణించారు.

1955లో తమిళనాడులోని కడలూరు జిల్లా కర్ణతం గ్రామంలో కర్ణన్ జన్మించారు. 1983లో మద్రాస్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా పనిచేశారు. 2009 మార్చిలో మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే ఆయన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో తోటి న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టుతోనూ పలుమార్లు విభేదాలు తలెత్తాయి. తనకు న్యాయవ్యవస్థలో కుల వివక్ష ఎదురవుతోందని, తోటి న్యాయమూర్తులు తనను వేధిస్తున్నారని కర్ణన్ పలుమార్లు ఆరోపించారు. ముఖ్యంగా అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జస్టిస్ కౌల్‌పై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఆశ్రయిస్తానని కూడా చెప్పారు.

2014లో మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుగుతున్న సమయంలో కర్ణన్ జోక్యం చేసుకున్నారు. న్యాయమూర్తుల ఎంపిక విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ ప్రక్రియలో న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఆయన చేసిన నిరసన ఊహించనిదని, సరైన పద్ధతిలో లేదని వ్యాఖ్యానించింది.

2015 నవంబర్‌లో అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కర్ణన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి కూడా పంపించారు. తనకు ప్రాధాన్యం లేని, పేరుకే ఉన్న పనులు అప్పగిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను సుదీర్ఘ సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టుకు చెందిన 20 మంది న్యాయమూర్తులు ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 2016లో కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఈ బదిలీ ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు.

2017 జనవరిలో కర్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. పలువురు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆయన పలు ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీంకోర్టు స్వయంగా కోర్టు ధిక్కరణ కేసును విచారణకు స్వీకరించింది.

2017 మే 9న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కర్ణన్‌ను కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతకుముందు రోజే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కర్ణన్ స్వయంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జైలు శిక్ష విధించిన తర్వాత కొంతకాలం పాటు కర్ణన్ ఆచూకీ పోలీసులకు లభించలేదు. చివరకు అదే ఏడాది ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం 2017 డిసెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇలా న్యాయమూర్తిగా తనదైన శైలిలో వ్యవహరిస్తూ, తోటి న్యాయమూర్తులతో విభేదాలు, కుల వివక్ష ఆరోపణలు, సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన జస్టిస్ సీఎస్ కర్ణన్ 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.