దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2027 పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మే 23న (ఆదివారం) ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. 2027 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఢిల్లీ చేపట్టనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇదే సమయంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ఐఐటీ ఢిల్లీ ప్రారంభించింది. పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులకు అవసరమైన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా పరీక్షకు సంబంధించిన అర్హత ప్రమాణాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది.

అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష విధానం, ఇతర ముఖ్యమైన వివరాలకు సంబంధించి వెలువడే ప్రకటనలను గమనించాలని తెలిపింది.

ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027 పరీక్షలో అభ్యర్థులకు మరో వెసులుబాటు కల్పించారు. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పైనే ప్రాథమిక కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ఇది సాధారణ కాలిక్యులేటర్ మాత్రమేనని, సైంటిఫిక్ కాలిక్యులేటర్ కాదని ఐఐటీ ఢిల్లీ స్పష్టం చేసింది. ఇందులో 10 నుంచి 12 అంకెల వరకు చూపించే డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2027లో పరీక్ష రాయాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతపై దృష్టి పెట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఐటీ ఢిల్లీ విడుదల చేసిన అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.