YouTuber Arrested :  తమిళనాడులోని మధురైలో సంచలనం సృష్టించిన తనిష్క్ నగల దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మీనాక్షిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నిషాంత్ తండ్రి సురేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిషాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇప్పటివరకు సుమారు 5 కిలోల చోరీ చేసిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మధురై బైపాస్ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన తనిష్క్ షోరూమ్‌లో నవంబర్ 12న భారీ చోరీ జరిగింది. షోరూమ్ సిబ్బంది గురువారం ఉదయం వచ్చి చూడగా నగలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం 11.465 కిలోల బంగారు, వజ్రాల నగలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

విచారణలో భాగంగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఏర్పాటు కోసం ఉంచిన ఖాళీ ప్రదేశం నుంచి షోరూమ్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్ట్ పనుల కోసం ఏర్పాటు చేసిన తాడును ఉపయోగించి భవనంలోకి చేరుకున్నట్లు భావిస్తున్నారు. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ షోరూమ్ కేవలం 15 రోజుల పాటు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత ఈ దోపిడీ జరిగింది.

ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షోరూమ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ప్రాంతం నుంచి వెళ్లిన వాహనాల వివరాలను సేకరించారు. షోరూమ్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగులు, నిర్మాణ పనులు చేసిన కార్మికులను కూడా విచారించారు.

తాజాగా యూట్యూబర్ మీనాక్షి అరెస్ట్, సుమారు 5 కిలోల నగల స్వాధీనం ఈ కేసులో కీలక పరిణామాలుగా మారాయి. అయితే ప్రధాన నిందితుడు నిషాంత్ ఇంకా దొరకకపోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.