
గాజాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో హమాస్ సాయుధ విభాగం ‘అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్’కు చెందిన కీలక కమాండర్ సమీర్ మహ్మూద్ అబూ యూనిస్ మరణించారు. ఈ విషయాన్ని హమాస్ నవంబర్ 15న అధికారికంగా ధృవీకరించింది. రఫా బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్న అబూ యూనిస్, హమాస్ జనరల్ మిలిటరీ కౌన్సిల్లో కూడా ముఖ్య సభ్యుడిగా ఉన్నారు.
ఖాన్ యూనిస్‌లో డ్రోన్ ఎటాక్:
ఖాన్ యూనిస్‌లోని అల్-మవాసి ప్రాంతంలో జరిగిన డ్రోన్ ఎటాక్‌లో అబూ యూనిస్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) స్పందిస్తూ.. తమ భద్రతా ఏజెన్సీ ‘షిన్ బెట్’తో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో హమాస్ సీనియర్ లీడర్‌ను టార్గెట్ చేసినట్లు ప్రకటించింది. అయితే, ఆయన పేరును ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. కాగా, ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు నాసర్ మెడికల్ కాంప్లెక్స్ వెల్లడించింది. గత సెప్టెంబర్ 15న జరిగిన దాడిలో రఫా బ్రిగేడ్ మాజీ కమాండర్ నాయెల్ అబూ ఒబైద్ మరణించగా, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన అబూ యూనిస్ కూడా ఇప్పుడు హతమవడం హమాస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
గాజా హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ 10, 2025న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 1,643 మంది పాలస్తీనీయులు మరణించగా, 5,964 మంది గాయపడ్డారు. ఇక అక్టోబర్ 2023లో యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తే మృతుల సంఖ్య 74,000 దాటగా, 1,76,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఈ సుదీర్ఘ యుద్ధం వల్ల గాజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతిందని, దీని రీకన్స్ట్రక్షన్ (పునర్నిర్మాణం) కోసం సుమారు 71.4 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి (UN) అంచనా వేస్తోంది.









