
Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ బిల్లును ఆమోదించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్యను 850కి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు ఈ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు అవసరం. అంటే కనీసం 361 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 320 మంది ఎంపీల బలం ఉంది. దీంతో బిల్లు ఆమోదం పొందాలంటే మరికొందరు ఎంపీల మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీల మద్దతు తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఈ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు పీటీఐ తెలిపింది. 15 నుంచి 18 ఓట్ల తేడాతో బిల్లు గెలుస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు సమాచారం.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు ఉన్నాయి. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వాటాను అలాగే కొనసాగించేలా మరో ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.









