
Punjab : పంజాబ్‌లో పోలీసులు ఓ గ్యాంగ్‌స్టర్ ముఠా ఆటకట్టించారు. గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ సింగ్ అలియాస్ అఫ్రిది నడుపుతున్న నేర ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 11 అక్రమ తుపాకులు, 191 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పలు కాల్పుల ఘటనలు, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ అఫ్రిదిని ఇటీవల ఇథియోపియా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. నవంబర్ 8న అతడిని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు విచారించారు. ఈ విచారణలో అతడి ముఠాలో పనిచేస్తున్న వారి వివరాలు బయటపడ్డాయి. దీంతో పంజాబ్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ (ఏజీటీఎఫ్), తరన్‌తారన్ పోలీసులు కలిసి ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.
పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన ఐదుగురిపై ఇప్పటికే 15కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డబ్బులు వసూలు చేసేందుకు కాల్పులు జరిపిన ఘటనల్లోనూ వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని తరన్‌తారన్ జిల్లాకు చెందిన అజయ్‌పాల్ సింగ్, జస్విందర్ సింగ్ అలియాస్ మున్సీ, కరణ్వీర్ అలియాస్ కరణ్, రంజిత్ రాణాగా గుర్తించారు. ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ అలియాస్ రాణాను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు మొత్తం 11 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఐదు .30 బోర్ పిస్టల్స్, ఒక .32 బోర్ పిస్టల్ ఉన్నాయి. వీటితో పాటు 191 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు విదేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఆదేశాలు ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి సూచనలతోనే పంజాబ్‌లో కాల్పులు, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తుపాకులను తీసుకురావడంలో కూడా నిందితులు సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అఫ్రిదిని భారత్‌కు తీసుకొచ్చిన వెంటనే పోలీసులు ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టారు. అతడి విచారణలో వచ్చిన సమాచారంతో కాల్పులు జరిపే వ్యక్తులు, వారికి తుపాకులు అందించేవారు, ఇతర పనుల్లో సహాయం చేసేవారిని గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ప్రమోద్ బాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న విదేశీ వ్యక్తులు ఎవరు? తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నేరాల్లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కాల్పుల ఘటనల్లో అరెస్టయిన ఐదుగురి పాత్ర ఎంత ఉందో కూడా పరిశీలిస్తున్నారు.









