
ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ రాజీనామా, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైనాకు AI ఆధారిత ‘హాపర్ సిరీస్’ చిప్స్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న కీలక సమయంలోనే ఎన్విడియా ఈ ప్రకటన చేయడం టెక్ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏఐ టెక్నాలజీ రేసులో అమెరికా, చైనా మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, గత ఏడాది ట్రంప్ ప్రభుత్వం అడ్వాన్స్డ్ చిప్స్ ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్విడియా భారీ స్థాయిలో డేటా సెంటర్ హాపర్-జనరేషన్ ప్రొడక్ట్స్‌ను చైనాకు ఎగుమతి చేస్తూ వచ్చింది. ఒక్క గత క్వార్టర్‌లోనే ఏకంగా 2.4 బిలియన్ డాలర్ల విలువైన చిప్స్‌ను చైనాకు విక్రయించింది. అయితే, తాజా వివాదాలతో అప్రమత్తమైన కంపెనీ, ఇకపై చైనాకు ఎలాంటి సేల్స్ చేయబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్విడియా తాత్కాలిక సీఈవో కొలెట్ క్రెస్ అధికారికంగా వెల్లడించారు.
చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళతో అనైతిక సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ ఇటీవల అంగీకరించి, సీఈవో పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. శక్తిమంతమైన సెమీకండక్టర్లను చైనాకు ఎగుమతి చేయడాన్ని అమెరికా అత్యంత సున్నితమైన భద్రతా అంశంగా చూస్తోంది. ఈ నేపథ్యంలో జెన్సన్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ప్రయోజనాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో విచారణ జరిపేందుకు అమెరికా ప్రతినిధుల సభ సిద్ధమైంది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు డిసెంబర్ 1న జెన్సన్ హువాంగ్ ప్రతినిధుల సభ కమిటీల ముందు హాజరుకానున్నారు.









