Visakhapatnam: విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీ (మసూరీ) లో చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తొలుత సాధారణ మరణంగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముస్సోరీ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సుధాకర్ – సత్యవతి దంపతుల కుమార్తె రాధాగాయత్రి. గురుగ్రామ్‌లో టెకీగా పనిచేస్తున్న ఈమెకు గతేడాది నవంబర్ 8న శ్రీచరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడు నెలలకే, జూన్ 15న ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో గాయత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తె మృతి వెనుక అల్లుడు శ్రీచరణ్ హస్తం ఉందంటూ తండ్రి సుధాకర్ ముస్సోరీతో పాటు డెహ్రాడూన్ పోలీసులను కలిసి 11 కీలక అంశాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు.

శ్రీచరణ్‌ది తీవ్రమైన సాడిస్ట్ ప్రవర్తన అని, పెళ్లయిన ఈ ఏడు నెలల కాలంలో తన కుమార్తెను నిరంతరం అనుమానిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేశాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ స్థాయికి వెళ్లాడంటే.. గాయత్రి ఎక్కడికి వెళ్తుందో నిఘా పెట్టేందుకు ఆమె బ్యాగ్‌కు ప్రత్యేకంగా ఒక ‘ట్రాకర్’ కూడా అమర్చినట్లు తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అతని మానసిక వేధింపులు తట్టుకోలేకనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, రాత్రి గాయత్రి తిన్న ఆహారంలో అతనే ఏదో విషపూరితమైన మందులు కలిపి ఇచ్చి ఉంటాడని వారు గట్టిగా అనుమానిస్తున్నారు.

తమకు చెప్పిన టూర్ ప్లాన్‌కు, వారు వెళ్లిన ప్రదేశాలకు అస్సలు పొంతన లేదని సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. “పిల్లలు కేవలం రుషికేశ్, హరిద్వార్ యాత్రకు మాత్రమే వెళ్తున్నట్లు మాకు చెప్పారు. ముస్సోరీ వెళ్తున్న విషయాన్ని గానీ, అక్కడ హోటల్ రూమ్ తీసుకున్న విషయాన్ని గానీ మాకు చెప్పలేదు” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఘటన జరిగిన జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 1:38 గంటల సమయంలో శ్రీచరణ్ ఫోన్ నుంచి భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక సెల్ఫీ ఫోటో గాయత్రి తల్లిదండ్రులకు వచ్చింది. పెళ్లయిన ఈ ఏడు నెలల్లో అంత అర్ధరాత్రి వేళ ఫోటో పంపడం ఇదే మొదటిసారని, ఇది తమ అనుమానాలను మరింత బలపరుస్తోందని తండ్రి పేర్కొన్నారు. పైగా బంగీజంప్ చేశామని భర్త చెబుతున్నప్పటికీ, ఇద్దరి ఫోన్లలో దానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేకపోవడం గమనార్హం.

మరోవైపు, గాయత్రి మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భర్త శ్రీచరణ్ వాదిస్తున్నాడు. ముస్సోరీలోని హోటల్ రూమ్‌లో తామిద్దరం ‘రెడ్ వైన్’ సేవించామని, ఆ తర్వాత తెల్లారి లేచి చూసేసరికి గాయత్రి చలనం లేకుండా పడి ఉందని, ఆమెకు లో-బ్లడ్ ప్రెషర్ (బీపీ) సమస్య ఉందని పోలీసులకు తెలిపాడు. అయితే, గాయత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. అలాగే, పోలీసులు సదరు హోటల్ యాజమాన్యాన్ని విచారించగా.. “మా హోటల్‌లో అసలు ఆల్కహాల్‌కే అనుమతి లేదు” అని తేల్చి చెప్పారు. దీనికి తోడు గాయత్రి మరణించిన సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం కారినట్లు ముస్సోరీ పోలీసులు గుర్తించారు. భార్య కుటుంబ సభ్యులకు శ్రీచరణ్‌ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో కూడా పోలీసులు పొందుపరిచారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ఘటన జరగడానికి ముందు 48 గంటల వ్యవధిలో అతని బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు వారు బస చేసిన హోమ్‌స్టే/హోటల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను, ఇద్దరి మొబైల్ ఫోన్ల కాల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులను సేకరించి విశ్లేషిస్తున్నారు. నిజానిజాలు త్వరలోనే పూర్తిస్థాయి విచారణలో తేలనున్నాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.