
Coal scam in Singareni : సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ ఎత్తున బొగ్గు నిల్వలు మాయమయ్యాయంటూ, దాదాపు ₹1,600 కోట్ల మేర కుంభకోణం జరిగిందంటూ ఇటీవల రాజకీయ వర్గాల్లో, కొన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. యాజమాన్యం చెబుతున్న లెక్కల్లోనే అంతులేని అయోమయం కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, సింగరేణి యాజమాన్యం ఈ వివాదంపై స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవమని, బొగ్గు మాయం కావడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, అలాగే విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా సాగుతున్నాయని యాజమాన్యం పేర్కొంది. గనుల నుంచి బొగ్గు వెలికితీసినప్పటి నుండి అది వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను డిజిటల్ పద్ధతిలో రికార్డ్ చేస్తున్నట్లు సంస్థకు చెందిన ఆపరేషన్స్ విభాగం సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం బహుళ అంచెల భద్రతా వలయం నడుమ సాగుతుందని వారు స్పష్టం చేశారు.
సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో దాదాపు 85 శాతం రైల్వేల ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ బొగ్గు కేటాయింపులను ఇంటిగ్రేటెడ్ ‘శాప్’ (SAP), ‘కోల్ నెట్’ (Coal Net) వంటి ఆన్‌లైన్ సిస్టమ్స్ ఆధారిత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. వినియోగదారుడు ఎవరు, ఏ గని నుండి బొగ్గు వెళ్తోంది, ఎంత పరిమాణంలో వెళ్తోంది, సరఫరా షెడ్యూల్ ఏమిటి అనే వివరాలన్నీ ముందే డిజిటల్‌గా నమోదవుతాయని, దీనివల్ల ప్రతి టన్ను బొగ్గును నిరంతరం ట్రాక్ చేయడం సాధ్యమవుతుందని అధికారులు వివరించారు.
రోడ్డు మార్గంలో జరిగే బొగ్గు రవాణాపై ప్లానింగ్ విభాగం కఠిన నిఘా ఉంచుతుందని అధికారులు తెలిపారు. బొగ్గును రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఎలక్ట్రానిక్ వైబ్రిడ్జ్‌ల (Weighbridges) ద్వారా ఖచ్చితంగా బరువు తూస్తారని వివరించారు. అలాగే ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్’ (RFID) ఆధారిత బూమ్ బారియర్లు, జీపీఎస్/జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్, జియో-ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా లారీల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తారు. నిర్దేశిత మార్గాన్ని వదిలి వాహనాలు వేరే రూట్లలోకి వెళ్తే సిస్టమ్ వెంటనే గుర్తించి సెంట్రల్ టీమ్‌ను అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు.
రైల్వే వ్యాగన్లలో బొగ్గు లోడింగ్, డిస్పాచ్ వివరాలను కూడా డిజిటల్‌గా రికార్డ్ చేస్తున్నట్లు రవాణా విభాగం అధికారులు తెలిపారు. గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, వైబ్రిడ్జ్‌లు, రైల్వే సైడింగ్‌లు, స్టాక్‌యార్డులు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిరంతరం సీసీటీవీ నిఘా ఉంటుంది. వీటికి తోడు చెక్‌పోస్టులు, ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, భద్రతా సిబ్బందితో 24 గంటల పాటు నిఘా కొనసాగుతుందని, నిరంతరాయంగా ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక సెక్యూరిటీ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. కాబట్టి ఎలాంటి అవకతవకలకు తావులేదని సంస్థ తేల్చిచెప్పింది.









