JAMMU BLAST : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేశ సరిహద్దులోని నియంత్రణ రేఖ (LoC) సమీపంలో శనివారం ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ ఆకస్మిక పేలుడు ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గుల్‌మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ)కి అత్యంత సమీపంలో ఉన్న ‘ఆశా పోస్ట్’ వద్ద ఈ పేలుడు సంభవించినట్లు రక్షణ, పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పేలుడు శబ్దం వినబడగానే భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని బారాముల్లా జిల్లా చందూసా ప్రాంతానికి చెందిన జాబిర్ అహ్మద్ బజాద్‌గా అధికారులు గుర్తించారు. అలాగే తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రతా బలగాలు తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.
ఈ పేలుడు ఎలా సంభవించింది, దీని వెనుక గల కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ ప్రాంతంలో పడి ఉన్న ఒక పాత బాంబు షెల్‌ను (Old Bomb Shell) మృతుడు తాకడం లేదా కదిలించడం వల్లనే అది ఒక్కసారిగా పేలి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలిన ఆ పదార్థం ఖచ్చితంగా ఏమిటనేది నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించి, నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.