
Germany Shooting : జర్మనీలో సోమవారం ఘోర తుపాకీ కలకలం రేగింది. ఉత్తర జర్మనీలోని స్టేడ్ (స్టాడ్) నగరంలో ఉన్న ఒక యూత్ కేర్ ఫెసిలిటీ (యువ కేంద్రం)లో దుండగులు జరిపిన భారీ కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హాంబర్గ్‌కు పశ్చిమాన దాదాపు 25 మైళ్ల దూరంలో, సుమారు 50 వేల జనాభా కలిగిన ఈ పట్టణ కేంద్రంలోని ‘డాంకర్స్ స్టాస్’ వీధిలో ఉన్న యువ కేంద్రంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో కార్యకలాపాలతో రద్దీగా మారిన ఈ నగర నడిబొడ్డున ఒక్కసారిగా తుపాకుల మోత మోగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.
రంగంలోకి రక్షక దళాలు – ఇద్దరి అరెస్ట్
ఈ ఘోర సంఘటనపై సమాచారం అందిన వెంటనే జర్మనీ రక్షక దళాలు, సాయుధ పోలీసు బలగాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి. కాల్పుల తీవ్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తమై, ఘటనా స్థలంలో ఉన్న ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని, ప్రాణాలు కాపాడుకోవాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాయి. జాతీయ మీడియాతో పాటు ప్రముఖ వార్తా సంస్థ ‘ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్’ (AFP) కథనాల ప్రకారం, పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరిలో ఒకడు ఈ మాస్ షూటింగ్‌కు తెగబడిన ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది.
దర్యాప్తు ముమ్మరం – గాయపడిన వారికి చికిత్స
ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే రక్షించి అత్యవసర సేవల విభాగం సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అసలు ఈ దారుణానికి ముందు అక్కడ ఏం జరిగింది? నిందితులు ఏ కారణంతో కాల్పులకు తెగబడ్డారు? అనే కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు అనుమానితులను ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
కఠిన చట్టాలున్నా తప్పని ప్రమాదాలు
సాధారణంగా జర్మనీతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలన్నింటిలోనూ తుపాకులు, ఆయుధాల విక్రయాలు ,వాటి వినియోగానికి సంబంధించిన చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. లైసెన్సులు పొందడం, ఆయుధాలు కలిగి ఉండటంపై అనేక ఆంక్షలు అమలులో ఉంటాయి. అయినప్పటికీ, ఇలాంటి మాస్ షూటింగ్ ఘటనలు అప్పుడప్పుడూ వెలుగుచూడటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రశాంతంగా ఉండే స్టేడ్ నగరంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘాతుకం పశ్చిమ ఐరోపా దేశాల్లో భద్రతా ఏర్పాట్లపై మళ్లీ చర్చకు దారితీసింది.









