
TSLPRB Notification 2026 : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తూ, అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘పోలీసు కొలువుల జాతర’కు అధికారికంగా తెరలేపింది. మొత్తం 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అందులో తొలి విడతగా 5 వేల పోలీసు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 2 వేల పోస్టులకు (జైళ్లు, అగ్నిమాపక, ఎస్పీఎఫ్ విభాగాలు) సంబంధించిన జీవోలు కూడా మరో రెండు రోజుల్లో వెలువడనున్నాయి.
ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఒకటి రెండు రోజుల్లోనే సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. స్థానిక కేడర్ వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు, వయోపరిమితి సడలింపు ,పరీక్షల షెడ్యూల్తో కూడిన పూర్తి వివరాలు బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా, అత్యంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు బోర్డు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు (మొత్తం: 5,000 పోస్టులు)
ప్రభుత్వం అనుమతించిన 5,000 ఖాళీలను మొత్తం 10 విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అందులో కానిస్టేబుల్ పోస్టులు సింహభాగం కాగా, ఎస్సై పోస్టులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి.
సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులు:
సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ (Civil SI): 148
ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (AR SI): 14
తెలంగాణ స్పెషల్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (TGSP SI): 12
ఎస్ఏఆర్ సీపీఎల్ సబ్ ఇన్స్పెక్టర్ (SAR CPL SI): 3
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI – FPB): 23
పోలీసు కానిస్టేబుల్ (PC) పోస్టులు:
సివిల్ కానిస్టేబుల్ (Civil PC): 3,697 (అత్యధికం)
ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ (AR PC): 1,052
ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ (SAR CPL PC): 24
డ్రైవర్ కానిస్టేబుల్ (Driver PTO): 20
మెకానిక్ కానిస్టేబుల్ (Mechanic PTO): 7
స్వరాష్ట్రంలో నాలుగో నోటిఫికేషన్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖలో నోటిఫికేషన్ రావడం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో జరిగిన నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:
2015: మొదటి విడతగా 9,281 పోస్టులతో తొలి నోటిఫికేషన్ విడుదలైంది.
2018: రికార్డు స్థాయిలో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు.
2022: మూడో విడత కింద 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు విజయవంతంగా ముగిశాయి.
2026: ప్రస్తుతం 7 వేల పోస్టులతో నాలుగో విడత జాతర ప్రారంభమైంది.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకాలను వేగవంతం చేస్తోంది. ఈ విడత రిక్రూట్మెంట్లో మహిళా అభ్యర్థులకు కేటాయించే రిజర్వేషన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే అగ్నిమాపక, జైళ్ల శాఖల ఆధునీకరణకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు ఉన్న సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టనున్నారు. నోటిఫికేషన్ ప్రకటన వెలువడుతుందనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలలో రాత్రింబగళ్లు శ్రమిస్తూ తమ ప్రిపరేషన్ను ముమ్మరం చేశారు.









