Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

TRS : తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) గట్టి షాక్ ఇచ్చింది. ఆమె రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును మార్చుకోవాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకురాలైన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఒక లేఖను పంపింది.

ఈ లేఖలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 15 రోజుల్లోగా ‘తెలంగాణ రక్షణ సేన’ స్థానంలో మరో మూడు ప్రత్యామ్నాయ పేర్లను (Alternative Names) తమకు సమర్పించాలని గడువు విధించింది. ఒకవేళ నిర్దేశిత సమయంలోగా కొత్త పేర్లను సూచించకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను పూర్తిగా క్లోజ్ చేస్తామని ఈసీ ఈ లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

700 ఫిర్యాదులు.. మెజారిటీ బీఆర్‌ఎస్ నుంచే!
కవిత ప్రతిపాదించిన ఈ కొత్త పార్టీ పేరుపై ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడమే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరుకు సంక్షిప్త రూపం ‘టీఆర్ఎస్’ (TRS) కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏకంగా 700 ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా ఈ 700 ఫిర్యాదుల్లో అత్యధికంగా భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ శ్రేణుల నుంచే రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో కేసీఆర్ నేతృత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ కూడా ‘TRS’ అనే పేరుతోనే దశాబ్దాల పాటు చలామణి అయింది. ఆ తర్వాత దానిని ‘BRS’గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత మళ్లీ అదే సంక్షిప్త నామం వచ్చేలా కొత్త పార్టీ పేరు పెట్టడంపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత పార్టీ పేరును, నాటి ఉద్యమ సెంటిమెంట్‌ను తలపించేలా ఈ పేరు ఉండటం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని ఈసీ కూడా అభిప్రాయపడింది. ప్రజా అభ్యంతరాల నేపథ్యంలో ఈ పేరును కొనసాగించడం కుదరదని ఈసీ తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

తగ్గేదేలే.. న్యాయపోరాటం చేస్తాం: కవిత
ఈసీ జారీ చేసిన ఆదేశాలపై కల్వకుంట్ల కవిత అత్యంత ధీటుగా స్పందించారు. ఈసీ లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు ఆమె ఇప్పటికే సమాధానాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈసీ కోరినట్లుగా ప్రత్యామ్నాయ పేర్లను ఇచ్చే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేయడం గమనార్హం. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపైనే తాను ముందుకు వెళ్తానని, ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం (Legal Battle) చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు.

బీఆర్‌ఎస్ అధిష్ఠానంతో విభేదించి, సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కవితకు.. ప్రారంభంలోనే ఇలాంటి చట్టపరమైన చిక్కులు ఎదురుకావడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

ఐదు పేర్ల పరిశీలన నుంచి ‘రక్షణ సేన’ దాకా..
నిజానికి ఈ పార్టీ ఏర్పాటు వెనుక గత కొన్ని నెలలుగా పెద్ద కసరత్తే జరిగింది:

ఫిబ్రవరి నెలలో  కవిత ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాస్తూ.. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే ఐదు పేర్లను పరిశీలన కోసం పంపారు.ఏప్రిల్ 25 న మునీరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) గా అనౌన్స్ చేసి, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.

అయితే ఏప్రిల్ 25న ఒక పేరు ప్రకటిస్తే.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే, అంటే ఏప్రిల్ 28న ఈసీ ఈ పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా ప్రాథమికంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల్లోగా ప్రజల నుంచి అభ్యంతరాలు తెలపాలని కోరింది.

ఇలా మూడు రోజుల్లోనే ‘రాష్ట్ర సేన’ కాస్తా ‘రక్షణ సేన’గా మారడం అప్పట్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు తాజాగా ఆ ‘రక్షణ సేన’ పేరుపైనే వెయ్యికి పైగా ఫిర్యాదులు రావడంతో ఈసీ బ్రేకులు వేసింది. ఈ పొలిటికల్ హైడ్రామా కవిత కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.