
Ayodhya Ram Temple Donations : అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించుకున్న కానుకలు, విరాళాల పక్కదారి వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకు అధికారులను ‘సిట్’ లోతుగా ప్రశ్నించినప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రతిరోజూ దాదాపు రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షల మేర భక్తుల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి రాకముందు వరకు, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాకు రోజువారీగా రూ. 16 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు మాత్రమే జమయ్యేవి. అయితే, నిందితులను పట్టుకుని నిఘా పెంచిన తర్వాత ఈ విరాళాల మొత్తం ఒక్కసారిగా రోజుకు రూ. 24 లక్షల నుండి రూ. 26 లక్షలకు పెరిగింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, రోజుకు కనీసం రూ. 8 లక్షల చొప్పున భారీగా నిధులు స్వాహా అయ్యాయని స్పష్టమవుతోంది. ఆలయంలో విరాళాల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సిట్ పరిశీలించింది. మొత్తం ఎనిమిది మంది నిందితులలో ఐదుగురి కదలికలు అత్యంత అనుమానాస్పదంగా కనిపించాయి. భక్తుల కానుకలను లెక్కించే సమయంలో, అలాగే వాటిని బ్యాంకుకు తరలించే తరుణంలో వీరు అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు ఫుటేజీల ద్వారా నిర్ధారణ అయింది.
నిందితులు డబ్బును తరలించడానికి ఎంచుకున్న మార్గాలు అధికారులను విస్మయానికి గురిచేశాయి. లెక్కింపు కేంద్రంలో కూర్చున్నప్పుడే కంటికి కానరాకుండా నోట్ల కట్టలను తమ జేబుల్లో, షూలు, సాక్సుల లోపల దాచేసేవారు. ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఆలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా చేరిన వీరు, భక్తుల నమ్మకాన్ని, దైవభక్తిని ఆసరాగా చేసుకుని భారీగానే బుక్కేసినట్లు తెలుస్తోంది. నిందితుల గత నేపథ్యాలను పరిశీలిస్తే వారి ఆర్థిక ఎదుగుదల ఆశ్చర్యం కలిగిస్తోంది. నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా అనే అవుట్‌సోర్స్ ఉద్యోగి, ఆలయంలో చేరకముందు హనుమాన్ గుహ వద్ద సాధారణ తాగునీటి విక్రయ కేంద్రం (వాటర్ స్టాల్) నడిపేవాడు. ఆలయ విరాళాల లెక్కింపు కేంద్రంలో చేరిన కొద్దిరోజులకే అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. శనివారం రాత్రి అయోధ్య పోలీసులు అతని నుండి ఒక ఖరీదైన ‘మారుతి బ్రెజ్జా’ ఎస్‌యూవీ (SUV) కారును సీజ్ చేశారు.
మరో నిందితుడైన లవకుశ్ మిశ్రా ఆర్థిక లావాదేవీలు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. గత ఏడాది అక్టోబర్ 16న బనీపూర్ ప్రాంతంలో ఇతడు ఏకంగా 1,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం దీని రిజిస్ట్రేషన్ విలువ రూ. 8 లక్షలుగా చూపించినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 లక్షల పైమాటేనని స్థానికులు చెబుతున్నారు. ఈ ముఠాలోని మరో నిందితుడు రామ్ శంకర్ అలియాస్ టిన్ను కథ కూడా ఇలాంటిదే. గతంలో సాధారణ డ్రైవర్‌గా జీవనం సాగించిన ఇతను, రామాలయ విరాళాల లెక్కింపు విధుల్లో చేరాక రూపురేఖలు మార్చేశాడు. భక్తులు సమర్పించిన సొమ్మును పక్కదారి పట్టించి, ఆ దొంగ డబ్బుతో ఏకంగా ఒక ప్రైవేట్ హాస్టల్‌ను ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సిట్ అధికారిక నివేదిక ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : ఒక సినిమా.. మూడు పేర్లు.. నాలుగేళ్ల సెన్సార్ యుద్ధం: ఓటీటీలోకి వచ్చిన 48 గంటల్లోనే మాయం.. అసలేం జరిగింది?
రూ. 5 కోట్ల ‘బంగారు రామచరిత్ మానస్’ మాయం?
ఈ నగదు చోరీల వ్యవహారం ఒకెత్తయితే, ఆలయానికి కానుకగా వచ్చిన ఒక అత్యంత విలువైన వస్తువు మాయమవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం, వెండి, రాగితో ప్రత్యేకంగా రూపొందించిన రూ. 5 కోట్ల విలువైన ‘రామచరిత మానస్’ గ్రంథం ప్రస్తుతం ఆలయంలో కనిపించడం లేదు. ఈ చారిత్రాత్మక గ్రంథాన్ని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఎస్. లక్ష్మీనారాయణ 2024 ఏప్రిల్‌లో ఆలయానికి బహుకరించారు. తొలిరోజుల్లో భక్తుల సందర్శనార్థం ఈ సువర్ణ గ్రంథాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అది ఉన్నట్టుండి మాయమైందని దాత లక్ష్మీనారాయణ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆలయ అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం. “మా మాతృమూర్తికి శ్రీరాముడిపై ఉన్న అచంచలమైన భక్తికి నిదర్శనంగా ఈ రామచరిత మానస్‌ను రూపొందించాం. ఆమె తన జీవితంలో దాదాపు 15 నుండి 18 ఏళ్ల పాటు నిరంతరం రామనామం రాయడానికే కేటాయించారు. అటువంటి పవిత్ర గ్రంథాన్ని భక్తుల కంటికి పడకుండా ఎందుకు దాచారు లేదా అది ఎక్కడికి పోయింది?” అని లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. 522 పేజీలున్న ఈ విశిష్ట పుస్తకం బరువు 147 కిలోలు కావడం విశేషం.
సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు డిమాండ్
ఈ అక్రమాలపై రాజకీయ రగడ మొదలైంది. కేంద్రంలోని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ ‘ఓటు చోరీ, సీటు చోరీ, చందాల చోరీ’ అనే మూడు సూత్రాల వ్యూహంతో దేశాన్ని దోచుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రామాలయ నిర్మాణం, ప్రారంభోత్సవ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. ఇప్పుడు జరుగుతున్న దొంగతనంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరూపిస్తే చర్యలు తీసుకోండి: వీహెచ్‌పీ లేఖ
మరోవైపు ఈ వివాదంపై విశ్వహిందూ పరిషత్ (VHP) కూడా స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఈ కుంభకోణం విలువ రూ. 20,000 కోట్లు అంటూ చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చాలని అయోధ్య పోలీసులను కోరింది. సమాజంలో ద్వేషం, శత్రుత్వాన్ని పెంచడానికే ఈ ఆరోపణలు చేసినట్లు తేలితే సదరు నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్.. అయోధ్య డీఎస్పీ అశుతోష్ తివారీకి లేఖ రాశారు.
Also Read : జిమ్ కార్బెట్ రిసార్ట్‌లో ‘రేవ్ పార్టీ’, సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..52 మంది అరెస్ట్!
నిందితుల విచిత్ర నేపథ్యాలు
రామమందిరంలో విరాళాల దొంగతనం కేసులో అరెస్టయిన 8 మంది నిందితుల ప్రొఫైల్స్ చూస్తే పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ముఠాలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక కార్ మెకానిక్, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడికి అత్యంత నమ్మకస్తుడైన సహచరుడు ఉన్నారు. వీరంతా పక్కా ప్లాన్ ప్రకారం కొంతకాలంగా విరాళాలను కొల్లగొడుతూ వచ్చారు. నిందితుడైన ఉపాధ్యాయుడు అవినాష్ శుక్లా నివాసంలో సోదాలు చేయగా దాదాపు రూ. 20 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ, భారీగా బంగారు నగలు లభ్యమయ్యాయి. ఆలయంలో సీసీటీవీ కెమెరాల నిఘా లేని ప్రాంతాలను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి, అక్కడ డబ్బును మరుగుదొడ్లలో దాచేవాళ్లమని అతడు ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇతను తన స్నేహితురాలికి రూ. 2 లక్షల నగదుతో పాటు ఖరీదైన మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తేలడంతో పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఆలయ డ్యూటీ ముగిశాక ఇతడు రోజూ పెద్ద మొత్తంలో నగదు బ్యాగులతో ఒక యోగా కేంద్రానికి వెళ్లేవాడని అతడి సోదరుడు అభిషేక్ పోలీసులకు తెలిపాడు.
మరో కీలక నిందితుడు, కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అనుకల్ప్ మిశ్రా ఇంట్లో రూ. 16.8 లక్షల నగదు దొరికింది. ఇతనికి రూ. 65 లక్షల విలువైన ఇల్లు, సొంత ఊరిలో ఫామ్‌హౌస్ ఉండటమే కాకుండా ఇటీవల ఒక కొత్త ఎస్‌యూవీ (SUV) కూడా బుక్ చేశాడు. ఇతను ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాకు బంధువు కావడం గమనార్హం. అలాగే అనుకల్ప్ బావమరిది, మాజీ కార్ మెకానిక్ అయిన లవకుశ్ మిశ్రా ఇంట్లో రూ. 14.25 లక్షలు లభించాయి. వీరితో పాటు రాంశంకర్ మిశ్రా ఇల్లు నుండి రూ. 7.3 లక్షలు, కరుణేష్ పాండే ఇంట్లో రూ. 18 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు సూపర్‌వైజర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుభాష్ చంద్ర శ్రీవాస్తవ ఈ ఘోర క్రమశిక్షణా రాహిత్యాన్ని, కుంభకోణాన్ని పసిగట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడని పోలీసులు తేల్చారు.









