Crime News : మానవత్వం మంటగలిసిపోతోంది.. కుటుంబ విలువలు, కన్నప్రేమ అనే పవిత్ర బంధాలను కాలరాస్తూ సమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లి అని కూడా చూడకుండా.. ఒక కుమారుడు మద్యం మత్తులో ఆమెపైనే లైంగిక దాడికి ఒడిగట్టాడు. పశువుకన్నా హీనంగా ప్రవర్తించిన ఆ కీచకుడి ఉదంతం స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని, ఆవేదనను రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన నమ్మశక్యం కాని కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ జీవనోపాధి నిమిత్తం కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది. ప్రస్తుతం ఆమె ఘట్‌కేసర్‌లోని ఒక భవనం సెల్లార్‌లో నివసిస్తూ, చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో పాచిపని చేస్తూ ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది. కాగా, ఆమె మొదటి భర్తకు జన్మించిన రెండో కుమారుడు విజయ్ (25) అనే యువకుడు గత రెండు నెలల క్రితం తల్లి వద్దకు వచ్చాడు. అప్పటినుంచి తల్లి సంపాదనపై ఆధారం పడుతూ, జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు.

అక్కడికి చేరినప్పటి నుండి విజయ్ స్థానికంగా చెడు తిరుగుళ్లకు బానిసయ్యాడు. ప్రతిరోజూ కూలీ డబ్బులతో మద్యం సేవించి, అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి కన్నతల్లిని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ గొడవపడేవాడు. రోజురోజుకూ ఇతని ప్రవర్తన హద్దులు మీరుతుండటంతో ఆ తల్లి లోలోపల కుంగిపోతూ, సమాజానికి భయపడి ఆ వేధింపులను భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీ రాత్రి కూడా విజయ్ విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు.

Also Read : ప్రియుడితో కలిసి దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసింది!

ఆ రాత్రి తల్లి నిద్రిస్తున్న సమయంలో విజయ్ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె నోట్లో గుడ్డ కుక్కి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకోవడానికి ఆ తల్లి తీవ్రంగా ప్రయత్నించి బయటకు పారిపోతుండగా.. విజయ్ ఆమెను వెంబడించి పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఇంట్లో ఉన్న కరెంట్ వైర్లను ఆమె మెడకు చుట్టి, ఊపిరాడకుండా చేసి బెదిరిస్తూ.. మరోసారి ఆమెపై అమానుషంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు.

మరుసటి రోజు ఉదయం నిందితుడి బారి నుండి ఎలాగోలా తప్పించుకున్న ఆ తల్లి, ఒంటిపై గాయాలతో, కన్నీరుమున్నీరవుతూ నేరుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తనను కన్న కొడుకే చేసిన నరకయాతనను, అమానుషాన్ని పోలీసుల ముందు వివరించి భోరున విలపించింది. లజ్జ విడిచి ప్రవర్తించిన కొడుకుపై ఆమె ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తక్షణమే స్పందించారు.

ఈ అత్యంత సున్నితమైన, దారుణమైన కేసుపై ఘట్‌కేసర్ పోలీసులు అత్యంత వేగంగా చర్యలు చేపట్టారు. నిందితుడు విజయ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత కఠినమైన చట్టాల కింద అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలించి, నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాధితురాలికి వైద్య సహాయం అందిస్తూ, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : 70 ఏళ్ల GHMC యాక్ట్ రద్దు.. పెరగనున్న పన్నులు.. కొత్త ‘క్యూర్‌-2026’ చట్టంలో ఏముంది?.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.